అమిత్‌ షాతో డీఎస్‌ భేటీ.. మేటరేంటి..?

అమిత్‌ షాతో డీఎస్‌ భేటీ.. మేటరేంటి..?

కొన్నాళ్లుగా టీఆర్‌ఎస్‌ పార్టీతో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్న రాజ్యసభ ఎంపీ డి.శ్రీనివాస్‌.. బీజేపీ బిగ్‌బాస్‌ అమిత్‌ షాతో భేటీ అవడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. ముఖ్యంగా.. ఈ వ్యవహారంపై టీఆర్‌ఎస్‌ పెద్దలు సీరియస్‌గా ఉన్నారని తెలిసింది. పార్లమెంట్‌ భవనంలోని అమిత్‌షా కార్యాలయానికి వెళ్లిన డీఎస్‌.. సుమారు పది నిమిషాలపాటు ఆయనతో సమావేశమయ్యారు. ఓ కేంద్ర మంత్రిని.. ఎంపీలా కలిశారని.. రాజకీయ ప్రాధాన్యం లేదని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతన్నా ఈ వ్యవహారం వెనుక పెద్ద ప్లానే ఉందని తెలుస్తోంది.

సుదీర్ఘకాలం కాంగ్రెస్‌లో పనిచేసిన డీఎస్‌.. ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరారు. నిజామాబాద జిల్లాలో పార్టీ నేతలతో విభేదాలు రావడంతో డీఎస్‌పై ఏకంగా కేసీఆర్‌కే కంప్లయింట్‌ చేశారు. అప్పటి నుంచి ఆయన టీఆర్‌ఎస్‌ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. పార్టీ ఆయనపై వేటు వేస్తుందని లేదా ఆయనే గుడ్‌బై చెబుతారని ప్రచారం జరిగింది. ఈక్రమంలో నిన్న టీఆర్‌ఎస్‌ సమావేశానికి డీఎస్‌ హాజరుకావడంతో ఆయన టీఆర్‌ఎస్‌లో కొనసాగుతారని అందరూ భావించారు. కానీ మరుసటి రోజే ఇలా అమిత్ షాను కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించకుంది. 

డీఎస్‌ కుమారుడు అరవింద్‌ మొన్నటి ఎన్నికల్లో బీజేపీ తరఫున ఎంపీగా గెలిచారు. ఇందుకు డీఎస్‌ ఆశీర్వాదంతోపాటు సహకారం కూడా ఉందని వార్తలొచ్చాయి. ఈక్రమంలో డీఎస్‌ కూడా ఇప్పుడు బీజేపీకి దగ్గరవుతున్నారా అనే అనుమానం కలుగుతోంది. డీఎస్‌ అనుచరులు కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ పార్టీల్లో ఉన్నారు. దీంతో.. డీఎస్‌ వంటి బలమైన నేతను పార్టీలో చేర్చుకుంటే భారీగా లబ్ధి పొందవచ్చని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. డీఎస్‌పై అనర్హత వేటు కోసం రాజ్యసభ ఛైర్మన్‌కు ఫిర్యాదు చేయాలని టీఆర్‌ఎస్‌ భావిస్తున్నట్టు తెలిసింది.