కేంద్రంపై విమర్శలు మానుకోండి

కేంద్రంపై విమర్శలు మానుకోండి

పోలవరం విషయంలో కేంద్రం సహకరించడం లేదని పదే పదే విమర్శించడం సరికాదని బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ పోలవరానికి కావాల్సిన ఏడు మండలాలను కలిపిన ఘనత తమ ప్రభుత్వానిదే అన్నారామే. ఆ ఏడు మండలాలను కలపకపోతే అసలు పోలవరం ప్రారంభమయ్యేదా అని ప్రశ్నించారు. ఏపీలో జరిగే ప్రతీ అభివృద్ధి కార్యక్రమంలో కేంద్రం సాయం ఉందని, అబద్ధాలు ఎవరు చెబుతున్నారో ప్రజలు గమనిస్తూనే ఉన్నారని చెప్పారు. రాజధానిలో తాత్కాలిక కట్టడాలను చూపించి చంద్రబాబు జనాన్ని మోసం చేస్తున్నారని విమర్శించారు.అమరావతిలో నిర్మాణాలపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు పురంధేశ్వరి. ఏపీకి 13 కేంద్ర రంగ సంస్థలు వచ్చాయని,కేంద్రం సహకారం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏం అభివృద్ధి చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు.  
అమరావతికి వస్తే మోడీని అడ్డుకుంటామని బెదరించడం మానుకోవాలని హితవు పలికారు.మోడీ దేశానికి ప్రధాని, ఆయన్ని ప్రతీ ఒక్కరూ గౌరవించాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో ఒక అనైతిక కూటమిని చూడబోతున్నామన్నారామే.రాష్ట్ర విభజన సమయంలో ఎందుకు ప్రత్యేకహోదాను చేర్చలేదని, కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు పురంధేశ్వరి. హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించింది చంద్రబాబు కాదా .. ప్యాకేజీ ఇస్తామన్నప్పుడు ఎక్కడ(,) కామాలు, ఎక్కడ పుల్ స్టాపులు (.) పెట్టాలో చెప్పింది కూడా ఆయనే, ఆ విషయం మర్చినట్లు ఉన్నారని ఎద్దేవా చేశారు.