చివరి దశకి చేరుకున్న దుర్గం చెరువు రోప్ బ్రిడ్జ్ 

 చివరి దశకి చేరుకున్న దుర్గం చెరువు రోప్ బ్రిడ్జ్ 

హైద‌రాబాద్ అంటేనే మ‌నంద‌రికి ట‌క్కున గుర్తొచ్చేది చార్మినార్, హైటెక్ సిటీ. అంత‌లా ఈ క‌ట్ట‌డాలు న‌గ‌రానికి గుర్తింపు తెచ్చాయి. అయితే ఇప్పుడు అదే కోవ‌లోకి మ‌రో క‌ట్టడం కూడా చేరిపోతుంది. అదే దుర్గమ్మ చెరువు ద‌గ్గర ప్రభుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా క‌డుతున్న రోప్ బ్రిడ్జి. ఆసియాలోనే రెండో పెద్ద వంతెన‌గా రికార్డుల‌కు ఎక్కబోతుంది ఈ క‌ట్టడం. దీనికి సంబంధించిన ప‌నులు చివ‌రి ద‌శ‌కు చేరుకోవ‌డంతో ప్రభుత్వం వంతెన ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తోంది. అత్యాధునిక  సాంకేతిక పరిజ్ఞానంతో ఈ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. ఎక్స్ ట్రా డోస్ట్ కేబుల్ స్టే పరిజ్ఞానంతో దీన్ని కడుతున్నారు.

కేవలం రెండున్నర గంటల వ్యవధిలోనే తీగల వంతెన రెండు సెగ్మెంట్లను అమర్చి ఇంజినీర్లు రికార్డు సృష్టించారు. ఈ వంతెన అందుబాటులోకి వస్తే రోడ్ నెంబర్ 45 నుంచి  ఐటీ కారిడార్‌కు రాకపోకలు సులువవుతాయి. హైటెక్‌సిటీ, కొండాపూర్‌, గచ్చిబౌలి ప్రాంతాల్లో ట్రాఫిక్‌ రద్దీ తగ్గనుంది. దుర్గం చెరువు రెండువైపుల రూపురేఖలు ఈ ప్రాజెక్ట్‌తో మారిపోనున్నాయి. అరుదైన జాతి మొక్కలను పెంచి గ్రీన్‌ రివర్‌ ఫ్రంట్‌గా తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తంగా సింగిల్‌ పిల్లర్‌తో వేలాడే తీగల వంతెన హైదరాబాద్‌కు హైలెట్‌గా నిలవడం ఖాయం అని ఎల్ అండ్ టీ అధికారులు అంటున్నారు.