ఢిల్లీని కమ్మేసిన ధూళి తుఫాను

ఢిల్లీని కమ్మేసిన ధూళి తుఫాను

చాలా రోజులుగా ప్రచండమైన ఎండలతో తల్లడిల్లుతున్న ఢిల్లీవాసులకు కొంత ఊరట లభించింది. ఢిల్లీ, ఎన్సీఆర్ లో వాతావరణం మరోసారి హఠాత్తుగా మారిపోయింది. ఢిల్లీ ఎన్సీఆర్ లోని పలు ప్రాంతాల్లో ధూళి తుఫాను చెలరేగింది. ఢిల్లీలో ధూళితో కూడిన బలమైన గాలుల కారణంగా ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలను నిరవధికంగా నిలిపేశారు. ఢిల్లీకి సమీపంలోని గురుగ్రామ్, నోయిడాలలో కూడా ఈ తుఫాను ప్రభావం ఉన్నట్టు తెలిసింది. ఢిల్లీలోని జనపథ్ రోడ్, ఇండియా గేట్ దగ్గర కూడా ధూళితో నిండిన తుఫాను కారణంగా ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ధూళి నిండిన బలమైన ఈదురుగాలుల వల్ల సాయంత్రం నగరం అంతా చీకట్లు కమ్ముకున్నాయి. తుఫాను వల్ల ప్రజలు పలు ఇక్కట్ల పాలయ్యారు. రోడ్లపై వాహనాలు నత్తనడకన సాగుతూ కనిపించాయి. పలుచోట్ల భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు లైట్లు వేసి వాహనాలు నడపాల్సి వస్తోంది. ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ వెదర్ అంచనా ప్రకారం భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తాయని స్కైమెట్ చెప్పింది.