'ఈసీ పనితీరుపై సందేహాలొద్దు'

'ఈసీ పనితీరుపై సందేహాలొద్దు'

ఎన్నికల సంఘం పని తీరు మీద సందేహాలు వద్దని.. ప్రతి దరఖాస్తునూ పరిశీలించాకే ఓట్ల తొలగింపు ఉంటుందని ప్రధాన ఎన్నికల అధికారి జీకే ద్వివేది స్పష్టం చేశారు. ఇవాళ ఆయన అమరావతిలో మాట్లాడుతూ మోసపూరితంగా ఓట్ల తొలగింపునకు ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోమన్నారు. ఏకపక్షంగా ఎక్కడ ఓట్లు తొలగించామో విమర్శించే వారు నిరూపించాలన్నారు. రాజకీయ విమర్శలతో తమకు సంబంధం లేదని.. ఎన్నికల సంఘానికి దురుద్దేశాలు ఆపాదించడం సరికాదని అన్నారు. 'మా సిబ్బంది తప్పు చేస్తే సస్పెండ్ అవుతారు. ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాం. నిబంధనల విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం' అని స్పష్టం చేశారు. 

ఓట్ల తొలగింపునకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా వందకు పైగా కేసులు నమోదయ్యాయని ద్వివేది చెప్పారు. ఐతే.. ఫారం 7 దరఖాస్తులు గణనీయంగా తగ్గిపోయాయని.. వారం క్రితం వరకు రోజుకు వేలల్లో.. వారానికి లక్షల్లో వచ్చేవని.. ఇప్పుడు 300 కూడా రావడం లేదన్నారాయన. ఐటీ గ్రిడ్స్‌ వ్యవహారంలో ఓటర్ల జాబితా ఎక్కడ నుంచి వచ్చిందో సైబరాబాద్‌ సీపీ సజ్జనార్ చెప్పాలన్న ద్వివేది.. డేటా ఎక్కడ నుంచి వచ్చిందో తేల్చాల్సింది పోలీసులేనన్నారు. ఎడిట్ చేయలేని ఓటర్ల జాబితాను మాత్రమే ఎన్నికల సంఘం విడుదల చేసిందని ఆయన చెప్పారు.