రేపు ఏపీలో ఎంసెట్ పరీక్షలు

రేపు ఏపీలో ఎంసెట్ పరీక్షలు

ఏపీలో ఎంసెట్-2019 పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ ఏడాది మొత్తం 2,82,633 మంది అభ్యర్థులు ఎంసెట్ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇంజినీరింగ్ విభాగం నుంచి 1,95,723 మంది, అగ్రికల్చర్, మెడికల్ విభాగాల నుంచి 86,910 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరికోసం మొత్తం 115 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఏపీలో 109, హైదరాబాద్‌లో 6 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోనివారు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్, క్వాలిఫైయింగ్ పరీక్ష హాల్‌టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలతో హాల్‌టికెట్ డౌన్‌‌లోడ్ చేసుకోవచ్చు. షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 20 నుంచి 24 వరకు ఆన్‌లైన్ విధానంలో ఎంసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంజినీరింగ్ పరీక్ష ఏప్రిల్ 20 నుంచి 23 వరకు; అగ్రికల్చర్ విభాగానికి ఏప్రిల్ 23, 24 తేదీల్లో, రెండు విభాగాలు రాసేవారికి ఏప్రిల్ 22, 23 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. ఆయా తేదీల్లో రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. మొదటి సెషన్‌లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, రెండో సెషన‌లో మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఏపీ ఎంసెట్‌కు నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదంటూ కాకినాడ జేఎన్‌టీయూ ప్రొఫెసర్, ఏపీ ఎంసెట్‌–2019 కన్వీనర్‌  సీహెచ్‌ సాయిబాబు ఒక ప్రకటనలో తెలిపారు.  విద్యార్థి హాల్‌ టికెట్‌లోనే పరీక్ష తేదీ, సమయం ఉంటాయని, దీనిని గుర్తుంచుకుని సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని తెలిపారు. పరీక్ష కేంద్రంలోకి ఎంసెట్‌ హాల్‌ టికెట్‌తో పాటు ఇంటర్‌ హాల్‌ టికెట్, ఓటరు ఐడీ, పాన్‌ కార్డు, పాస్‌పోర్ట్, ఆధార్‌ కార్డుల్లో ఏదేని ఒక గుర్తింపు కార్డు, బాల్‌పాయింట్‌ పెన్, ఎంసెట్‌ దరఖాస్తు, ఎస్సీ, ఎస్టీలు కుల ధ్రువీకరణ పత్రం తీసుకురావాలని సూచించారు. కాలిక్యులేటర్లు, సెల్‌ఫోన్లు, స్మార్ట్‌ వాచీలు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలను అనుమతించమని స్పష్టంచేశారు. బయోమెట్రిక్‌ అటెండెన్స్‌ నేపథ్యంలో పరీక్ష కేంద్రంలోకి ఉదయం 9గంటలకు, మధ్యాహ్నం 1.30గంటల నుంచే విద్యార్థులను అనుమతించనున్నట్లు తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.