శ్రీలంక ఉగ్రవాదులకు కశ్మీర్, కేరళలో శిక్షణ?!

శ్రీలంక ఉగ్రవాదులకు కశ్మీర్, కేరళలో శిక్షణ?!

ఏప్రిల్ 21న ఈస్టర్ పండుగనాడు జరిగిన వరుస బాంబు పేలుళ్లపై శ్రీలంక ఆర్మీచీఫ్ మహేష్ సేనానాయకే సంచలన ప్రకటన చేశారు. ఈ దాడుల డొంక తీగెలు భారత్ లో ఉన్నాయని ప్రకటించారు. ఒక మీడియా కథనం ప్రకారం శ్రీలంక ఆర్మీ చీఫ్ బహుశా శిక్షణ పొందే ఉద్దేశంతో ఉగ్రవాదులు కశ్మీర్, కేరళలో పర్యటించినట్టు చెప్పారు. శ్రీలకంలో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో 350 మందికి పైగా మరణించారు. 500 మందికి పైగా గాయపడ్డారు.

ఉగ్రవాదుల ఈ యాత్ర వెనుక ఉద్దేశం గురించి మీకు తెలుసా అని విలేకరులు సేనానాయకేను ప్రశ్నించారు. దీనికి సమాధానంగా 'ఏదైనా శిక్షణ లేదా దేశం బయట ఇతర ఉగ్రవాద సంస్థలలో సంబంధాలు ఏర్పరచుకొనేందుకు వెళ్లి ఉండవచ్చని' తెలిపారు. 'మా దగ్గర ఉన్న సమాచారం మేరకు భారత్ లో బెంగుళూరు, కశ్మీర్, కేరళలకు వాళ్లు వెళ్లారని' అన్నారు. తమిళనాడు, కేరళలోని కొన్ని ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) వంటి ఉగ్రవాద వ్యతిరేక ఏజెన్సీలు దాడులు జరిపాయి. ఈ దాడుల్లో ఇస్లామిక్ స్టేట్ తో సంబంధాలు ఉన్నట్టు అనుమానిస్తున్న పలువురిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. శ్రీలంక దాడులకు తమదే బాధ్యతని ఉగ్రవాద సంస్థ ఐఎస్ ప్రకటించుకొంది.