మోడీ వెబ్ సిరీస్ ను ఆపేయండి: నిర్మాతలకి ఈసీ ఆదేశం

మోడీ వెబ్ సిరీస్ ను ఆపేయండి: నిర్మాతలకి ఈసీ ఆదేశం

లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎన్నికల సంఘం కఠిన చర్యలు చేపడుతోంది. ఇటీవలే కొందరు నేతలను ఎన్నికల ప్రచారం నుంచి 48-72 గంటల పాటు పాల్గొనకుండా ఆంక్షలు విధించిన ఈసీ, ఇప్పుడు మరో పెద్ద నిర్ణయం ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై నిర్మించిన వెబ్ సిరీస్ ను తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ నుంచి తొలగించాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది. చిత్ర నిర్మాతలైన ఈరోస్ నౌను ఆన్ లైన్ స్ట్రీమింగ్ నుంచి వెబ్ సిరీస్ 'మోడీ-జర్నీ ఆఫ్ ఎ కామన్ మ్యాన్'కి చెందిన అన్ని 5 ఎపిసోడ్ లను తక్షణమే తొలగించాలని కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.

ఏప్రిల్ 10న ఎన్నికల సంఘం 'పీఎం నరేంద్ర మోడీ' విడుదలను అడ్డుకున్నప్పటి నుంచి ఈ వెబ్ సిరీస్ పై కూడా కమిషన్ కు అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఆ ఫిర్యాదులను పరిశీలించిన సంఘం, అన్ని ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ ల నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ ని ఆపేయాలని, వెంటనే వాటిని అక్కడి నుంచి తొలగించాలని సూచించింది. తన ఏప్రిల్ 10కి ముందు ఆదేశాలను గుర్తు చేస్తూ ఈ వెబ్ సిరీస్ ను ఆపాలని ఆదేశించింది. ఎన్నికల ప్రవర్తన నియమావళిని పేర్కొంటూ 'వెబ్ సిరీస్ కి సంబంధించిన విషయాలు, ప్రసారం చేస్తున్న కంటెంట్ ని బట్టి చూస్తే ఇది ప్రధానమంత్రి, ఒక రాజకీయ నేతగా మోడీ జీవితంపై ఆధారపడి నిర్మించిన వెబ్ సిరీస్ అని స్పష్టం అవుతోంది. లోక్ సభ ఎన్నికల్లో ఒక అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆయన నిజజీవిత కథపై ఆధారపడి నిర్మించిన ఈ వెబ్ సిరీస్ ప్రదర్శనకు అనుమతి ఇవ్వలేమని' ఈసీ తన ఆదేశాలలో స్పష్టం చేసింది.