మోడీపై వ్యాఖ్యలు చేసినందుకు సిద్ధూకి ఈసీ నోటీస్

మోడీపై వ్యాఖ్యలు చేసినందుకు సిద్ధూకి ఈసీ నోటీస్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేసినందుకు ఎన్నికల సంఘం కాంగ్రెస్ నేత నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూకి నోటీసులు పంపి సమాధానం కోరింది. రేపు సాయంత్రం 6 గంటల్లోగా జవాబు ఇవ్వాలని ఈసీ సిద్ధూకి సూచించింది. ఏప్రిల్ 17న గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఒక ర్యాలీ సందర్భంగా నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూ ప్రధాని మోడీపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ లోక్ సభ సీటులో నిర్వహించిన ఒక ర్యాలీలో నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూ ' అరె నరేంద్ర మోడీ, నీ దేశభక్తి ఎలాంటిది? కడుపులు ఖాళీగా ఉన్నాయి, యోగా చేయిస్తున్నారు? అందరినీ బాబా రామ్ దేవ్ చేసేయండి. ఖాళీ పొట్టలు ఉన్నాయి. యోగా చేయిస్తున్నారు. జేబులు ఖాళీ అయ్యాయి. ఖాతాలు తెరిపిస్తున్నారు' అని వ్యాఖ్యానించారు. నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూ ప్రధాని మోడీపై ఇలా దాడి చేయడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకు ముందు సిద్ధూ యోగా దినం, జన్ ధన్ బ్యాంక్ ఖాతాలు తెరిపించే కార్యక్రమాలపై తన దేశభక్తి ప్రశ్నార్థకమయ్యేలా వ్యాఖ్యానాలు చేశారు.