రఫెల్ డీల్ పై పుస్తకం విడుదలను అడ్డుకున్న ఈసీ

రఫెల్ డీల్ పై పుస్తకం విడుదలను అడ్డుకున్న ఈసీ

ఇవాళ తమిళనాడు రాజధాని చెన్నైలో ఓ అభ్యుదయ ప్రచురణ సంస్థ, భారతి పుస్తకాలయం రఫెల్ డీల్ పై ప్రచురించిన పుస్తకం విడుదల కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం అడ్డుకుంది. పుస్తకం విడుదల ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కిందికి వస్తుందని ఈసీ తెలిపింది. రఫెల్ ఒప్పందం, దానికి సంబంధించిన వివాదం గురించి రచయిత, అనువాదకుడైన ఎస్. విజయన్ రాసిన నాటై ఉలుక్కుమ్ రఫెల్ బేరా ఊళల్ (రఫెల్:దేశాన్ని కుదిపేసిన కుంభకోణం) అనే ఈ పుస్తకావిష్కరణకు ద హిందూ వార్తాపత్రిక చైర్మన్ ఎన్. రామ్ ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉంది.

కార్యక్రమానికి కొద్ది గంటల ముందు ఎన్నికల సంఘం ఫ్లైయింగ్ స్క్వాడ్ పుస్తక విక్రయ కేంద్రాల్లో అమ్మకానికి సిద్ధంగా ఉన్న కాపీలను స్వాధీనం చేసుకొని, ఆ కార్యక్రమంపై నిషేధం విధించారు. ద హిందూ ఇటీవల ఈ రఫెల్ డీల్ ఒప్పందంలో జరిపిన చర్చలు, ధరల వివరాలను వెల్లడిస్తూ వరుస కథనాలు ప్రచురించింది. 

సాయంత్రం తమిళనాడు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆ నిర్ణయాన్ని ఉపసంహరిస్తున్నట్టు ప్రకటించారు. పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని నిలిపేసేందుకు ఎవరికి అధికారం ఇచ్చారో తనకు తెలియదని చెప్పారు. ఆ సమావేశం యధావిధిగా కొనసాగనిచ్చేందుకు అనుమతించారని ఎన్ రామ్ తెలిపారు. ఈ సంఘటనతో ఈసీకి ఎలాంటి సంబంధం లేదని ఎలక్షన్ కమిషనర్ అశోక్ లవాసా ప్రకటించారు.