ప్రధాని మిషన్ శక్తి ప్రసంగం పరిశీలించనున్న ఎన్నికల సంఘం

ప్రధాని మిషన్ శక్తి ప్రసంగం పరిశీలించనున్న ఎన్నికల సంఘం

మిషన్ శక్తిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతి నుద్దేశించి ప్రసంగించిన వ్యవహారాన్ని ఎన్నికల సంఘం పరిశీలనకు స్వీకరించింది. దీనిని పరిశీలించేందుకు సంఘం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ప్రధాని మోడీ ప్రసంగం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిందా లేదా అనే విషయాన్ని ఈ కమిటీ దర్యాప్తు చేయనుంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం జాతి నుద్దేశించి ప్రసంగిస్తూ 'శాస్త్రవేత్తలు లో ఎర్త్ ఆర్బిట్ లో 300 కిలోమీటర్ల దూరంలోని ఒక లైవ్ శాటిలైట్ ను కూల్చేశారు. ఈ ఆపరేషన్ 'మిషన్ శక్తి' భారత్ యాంటీ శాటిలైట్ మిస్సైల్ ఏ-శాట్ ద్వారా కేవలం మూడు నిమిషాల్లో పూర్తి చేశారని' తెలిపారు.

మోడీ ఎన్నికల కోడ్ ని ఉల్లంఘించారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరీ, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి..ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఉమర్ అబ్దుల్లా ఆరోపించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన జరిగిందని సీపీఎం ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో ఫిర్యాదు చేసింది.

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మిషన్ శక్తి విజయవంతం కావడంపై డీఆర్డీవోని ప్రశంసించారు. ప్రధాని మోడీని వెటకారం చేశారు. రాహుల్ తన ట్వీట్ లో 'వెల్ డన్ డీఆర్డీవో. మీ ఘనవిజయానికి మేం ఎంతో గర్విస్తున్నాం. నేను ప్రధానమంత్రికి వరల్డ్ థియేటర్ డే సందర్భంగా చాలా చాలా శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటున్నాను' అని పేర్కొన్నారు.

బీఎస్పీ సుప్రీమో మాయావతి 'అంతరిక్షంలో శాటిలైట్ ని కూల్చేసే పరీక్షను భారత రక్షణ శాస్త్రవేత్తలు విజయవంతంగా పూర్తిచేసి దేశం సగర్వంగా తలెత్తుకొని నిల్చునేలా చేసినందుకు శుభాకాంక్షలు. కానీ ఈ ముసుగులో మోడీ ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకు రాజకీయం చేయాలని చూడటం అత్యంత నిందనీయం. ఎన్నికల సంఘం దీనిపై తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవాలని' తన ట్వీట్ లో కోరారు.

'ఇది రాజకీయ ప్రకటన. శాస్త్రవేత్తలు ఈ ప్రకటన చేయాలి. ఇది వాళ్ల ఘనత. ఎన్నికల సమయంలో కోడ్ ఉల్లంఘించిన క్రెడిట్ తన ఖాతాలో వేసుకొనేందుకు కాకపోతే మోడీ ఈ ప్రకటన చేయాల్సిన అవసరమేంటి? ఆయనేమైనా ఈ మిషన్ లో పని చేశారా? ఆయన అంతరిక్షంలోకి వెళ్లారా? దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని' పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన ట్వీట్ లో పేర్కొన్నారు.