ఓమ్ ప్రకాష్ చౌతాలా రూ.3.68 కోట్ల ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ

ఓమ్ ప్రకాష్ చౌతాలా రూ.3.68 కోట్ల ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ

హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓమ్ ప్రకాష్ చౌతాలాకి చెందిన రూ.3.68 కోట్ల విలువైన ఫ్లాట్, చుట్టుపక్కల భూమిని ఇవాళ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. ఓమ్ ప్రకాష్ చౌతాలాపై ఉన్న మనీ లాండరింగ్ ఆరోపణల దర్యాప్తులో ఒక ఫ్లాట్, పరిసర భూమిని స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ సోమవారం ప్రకటించింది. 

ఈ ఆస్తులన్నీ ఢిల్లీ, పంచకులా, సిర్సా, హర్యానాలో ఉన్నాయని ఈడీ తెలిపింది. వీటన్నిటినీ మనీ లాండరింగ్ చట్టం కింద అటాచ్ చేసినట్టు ఈడీ చెప్పింది. అటు సీబీఐ కూడా ఓమ్ ప్రకాష్ చౌతాలాపై ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. నల్లధనాన్ని తెలుపు చేసినట్టు ఆ ఎఫ్ఐఆర్ లో ఆరోపించింది. 

'చౌతాలా న్యూఢిల్లీ, పంచకులలో అక్రమంగా భూములను కొనుగోలు చేశారు. హర్యానా, సిర్సాలలో ఇళ్లు కూడా నిర్మించారు. ఇందుకోసం అక్రమంగా సంపాదించిన డబ్బుని ఉపయోగించారని' ఈడీ తన ప్రకటనలో వివరించింది. 'చౌతాలా తనకున్న అక్రమ ఆస్తులను సక్రమం చేసుకొనేందుకు ప్రయత్నించినట్టు దర్యాప్తులో తెలిసింది. ఆయన 2005, 2009 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అలాంటి ఎన్నో ఆస్తులను ప్రస్తావించారు. ఈ మధ్య కాలంలో ఆయన అక్రమ ఆస్తులను సక్రమ ఆస్తులు చేసుకొనేందుకు ప్రయత్నించారని' ఈడీ తెలిపింది.