జకీర్ నాయక్ పై చార్జిషీట్ దాఖలు చేసిన ఈడీ

జకీర్ నాయక్ పై చార్జిషీట్ దాఖలు చేసిన ఈడీ

వివాదాస్పద మత ప్రచారకుడు జకీర్ నాయక్ పై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ పట్టు బిగిస్తోంది. ఇవాళ ఈడీ జకీర్ నాయక్ పై ముంబైలోని ప్రత్యేక కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది. జకీర్ నాయక్ మనీ లాండరింగ్ కు పాల్పడినట్టు ఛార్జిషీట్ లో ఈడీ అధికారులు పేర్కొన్నారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద దర్యాప్తు సంస్థ ప్రాసెక్యూషన్ ఫిర్యాదును నమోదు చేసింది. ఈ నేరం ద్వారా రూ.193.06 కోట్ల అక్రమ ఆస్తులను గుర్తించామని తెలిపింది.

ఇప్పటి వరకు జకీర్ నాయక్ కు చెందిన రూ.50 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. జకీర్ నాయక్ తో పాటు మరికొందరిపై కూడా మనీ లాండరింగ్ కేసు నమోదైంది. నాయక్ ఉగ్రవాదులను రెచ్చగొడుతున్నారని దర్యాప్తు సంస్థ ఆరోపణలు చేసింది. జకీర్ నాయక్ తన పీస్ టీవీ ద్వారా మత విద్వేషాలను వ్యాప్తి చేస్తున్నారని అభియోగం మోపింది.

ఈ కేసులో ఈడీ దాఖలు చేసిన రెండో ఛార్జిషీట్ ఇది. మొదటి ఛార్జిషీట్ లో ఈ వ్యవహారంలో నాయక్ పాత్రను పేర్కొనడం జరిగింది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఎఫ్ఐఆర్ ఆధారంగా నాయక్ ను ఈడీ 2016లో బుక్ చేసింది. 2016లో బంగ్లాదేశ్ రాజధాని ఢాకా ఉగ్రదాడికి ప్రేరేపించాడన్న ఆరోపణలతో చార్జ్‌ షీట్‌ నమోదు చేసింది.