నీరవ్ మోడీ కేసు: ఈడీలో అంతర్గత గందరగోళం

నీరవ్ మోడీ కేసు: ఈడీలో అంతర్గత గందరగోళం

ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉండగా ఆపద్ధర్మ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్నడూ కనీవినీ ఎరుగని నిర్ణయం తీసుకుంది. నీరవ్ మోడీ కేసు దర్యాప్తు చేస్తున్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారిని శుక్రవారం బదిలీ చేసింది. ఆ తర్వాత రెండు గంటల్లోనే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించింది. సుప్రీంకోర్ట్ పర్యవేక్షణలో జరుగుతున్న బొగ్గు కుంభకోణాన్ని సత్యబ్రత కుమార్ దర్యాప్తు చేస్తున్నారు. 

నీరవ్ మోడీ కేసు దర్యాప్తు చేస్తున్న ఈడీ జాయింట్ డైరెక్టర్ సత్యబ్రత కుమార్ ని అనూహ్యంగా ముంబై ఈడీ స్పెషల్ డైరెక్టర్ గా బదిలీ చేయడంతో పలు అనుమానాలు కలిగాయి. ఇవాళ నీరవ్ మోడీ బెయిల్ పిటిషన్ విచారణకు హాజరయ్యేందుకు లండన్ వెళ్లిన ఈడీ బృందంలో ఉన్న సత్యబ్రత కుమార్ తన బదిలీని ద వైర్ కి ధృవీకరించారు. అయితే బదిలీ, దాని రద్దు ఉత్తర్వులపై ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.

సత్యబ్రత కుమార్ బదిలీ ఉత్తర్వుల జారీ విషయం ఈడీ రిపోర్ట్ చేసే ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీకి తెలుసని సీనియర్ అధికారులు చెబుతున్నారు. లండన్ లో నీరవ్ మోడీ అరెస్ట్ కావడం, తనను భారత్ కి అప్పగించవద్దని అతను అప్పీల్ చేసిన నేపథ్యంలో ఈ కేసు దర్యాప్తునకు ఇన్ ఛార్జీగా ఉన్న అధికారిని ప్రభుత్వం ఎందుకు బదిలీ చేసిందో అర్థం కావడం లేదని వారు వ్యాఖ్యానిస్తున్నారు. సత్యబ్రత కుమార్ బదిలీకి ఆయన డిప్యుటేషన్ కాలం ముగిసిందని ఒక కుంటిసాకు మాత్రం పేర్కొన్నారు. 

ఈడీ డైరెక్టర్ సంజయ్ కుమార్ మిశ్రా అనూహ్యంగా స్పెషల్ డైరెక్టర్ గా బదిలీ ఉత్తర్వులను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయకపోయి ఉంటే కచ్చితంగా ఇది మరో పెద్ద వివాదంగా మారేది. ఇలా చేస్తే కచ్చితంగా సుప్రీంకోర్ట్ ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుందన్న భయంతోనే ప్రభుత్వం వెనక్కి తగ్గిందని భావిస్తున్నారు.

మరి కుమార్ ని ఇంత వేగంగా తొలగించడానికి కారణాలేమై ఉంటాయంటే నీరవ్ మోడీ కేసుని ప్రధానమంత్రి కార్యాలయం ప్రత్యేకంగా పర్యవేక్షిస్తోందని, కుమార్ ఇందులో రాజకీయ జోక్యం చేసుకొనే ప్రయత్నాలను తీవ్రంగా ప్రతిఘటిస్తున్నందువల్లే ఈ బదిలీ ఉత్తర్వు జారీ అయినట్టు భావించాలి. ఇదంతా చూస్తుంటే ఈడీలో కూడా ఇటీవల సీబీఐలో జరిగిన అంతర్గత పోరు లాంటిదేదో జరుగుతోందనే అనుమానాలు కలుగుతున్నాయి.