అమ్మ ఆస్తి ముద్దు...అమ్మ కాదు !

అమ్మ ఆస్తి ముద్దు...అమ్మ కాదు !

అమ్మను మించిన దైవం లేదు అంటారు. కానీ వృద్దాప్యంలో అమ్మకు అన్నం పెట్టలేక ఇంట్లో నుంచి బయటకు గెంటేశారు కొడుకులు. నిస్సహాయ స్థితిలో కొడుకులు పట్టించుకోకుండా పోవడంతో  రోడ్డున పడి ఆశ్రయం కోసం ఎదురుచూస్తోంది ఆ తల్లి. వృద్దాప్యంలో ఆమె పడుతున్న వేదన చూస్తే ఎవరికైనా కళ్లు చెమ్మగిల్లక మానవు. ఆమె పేరు అనంతుల లక్ష్మమ్మ. వయస్సు 80 ఏళ్లు.  యాదాద్రి భువనగిరి జిల్లా మోట కొండూరు మండలంలోని ముత్తి రెడ్డి గూడెం గ్రామానికి చెందిన లక్ష్మమ్మను పిల్లలు ఇంటి నుంచి గెంటేయడంతో నడిరోడ్డులో దిక్కుతోచని పరిస్థితిలో ఉంది.

లక్ష్మమ్మకు ముగ్గురు కొడుకులు, ఒక కుమారై ఉన్నారు. తల్లికి తిండిపెట్టలేని దీన స్థితిలో ఏమీ లేరు లక్ష్మమ్మ కన్న బిడ్డలు. నిజానికి తన పిల్లలను కంటికి రెప్పలా సాకింది లక్ష్మమ్మ.  70 ఎకరాల భూమి... ఇతర ఆస్తుపాస్తుల్ని కూడా రక్షిస్తూ వచ్చింది. బహుశా అదే ఆమె చేసిన పెద్ద తప్పుగా భావిస్తున్నారో ఏమో..? లక్ష్మమ్మ నుంచి ఆస్తిని లాక్కుని పంచుకున్న పిల్లలు ఆమెను మాత్రం రోడ్డుపైకి నెట్టేశారు. పాతికేళ్ళ క్రితం లక్ష్మమ్మ భర్త మరణించాడు. దీంతో ఆమె కష్టాలు మొదలయ్యాయి. మొదట్లో నెలకు ఒక్కరు పోషించేలా పెద్దలు ఒప్పందం చేశారు.

అయితే నాలుగు రోజులు క్రితం అన్నం పెట్టలేమంటూ లక్ష్మమ్మను ఇంటి నుంచి గెంటేశారు కొడుకులు. వృద్దాప్యంలో ఉన్న ఆ మాతృమూర్తి ఐదు రోజులుగా చెట్టు క్రింద బిక్కుబిక్కుమంటూ గడుపుతోంది. ఇది చూసి స్థానికులు చలించిపోతున్నారు కానీ ఆ కొడుకులుకి ఏమాత్రం పట్టలేదు. పుత్రుడు అంటే పున్నామ నరకం నుంచి రక్షించేవాడు. కాని బతికుండగానే తల్లికి నరకం చూపిస్తున్నారు ఈ పుత్రులు. ఈ ఘటనపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కన్న తల్లిపై కనికరం లేని కొడుకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు.