సన్నీ డియోల్ తో అమిత్ షా భేటీ!!

సన్నీ డియోల్ తో అమిత్ షా భేటీ!!

బాలీవుడ్ హీమ్యాన్ ధర్మేంద్ర, ఆయన భార్య హేమా మాలినీ తర్వాత ఇప్పుడు యాక్షన్ హీరోగా పేరున్న ఆయన పెద్ద కుమారుడు సన్నీ డియోల్ కూడా బీజేపీలో చేరతారనే వార్తలు జోరుగా సాగుతున్నాయి. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాతో సన్నీ డియోల్ భేటీ అయిన ఫోటో ఇప్పుడు తెగ వైరల్ గా మారింది. పూణెలోని సన్నీ డియోల్ ఫామ్ హౌస్ లో వీళ్లిద్దరూ శుక్రవారం సాయంత్రం సమావేశమయ్యారు. సన్నీని పంజాబ్ లో పార్టీ ప్రతిష్ఠకు కీలకంగా భావిస్తున్న అమృత్ సర్ నుంచి పోటీకి అమిత్ షా భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అమ్రోహకి చెందిన బీజేపీ నేత తరుణ్ రాఠీ శుక్రవారం సాయంత్రం తన ఫేస్ బుక్ వాల్ పై ఒక ఫోటో పోస్ట్ చేశారు. అందులో అమిత్ షా, సన్నీ డియోల్ కూర్చొని ఉన్నారు. వారితో పాటు రాఠీ కూడ కనిపిస్తున్నారు. ఆ ఫోటోతో పాటు రాఠీ 'ఇవాళ పూణెలో ప్రియ మిత్రుడు సన్నీ డియోల్, జాతీయ అధ్యక్షుడు అమిత్ షోతో కలిసి లోక్ సభ ఎన్నికలపై చర్చించాను' అని రాశారు. కానీ ఇతర వివరాలను మాత్రం వెల్లడించలేదు.

అమిత్ షా బాలీవుడ్ యాక్టర్ సన్నీ డియోల్ ను పంజాబ్ ను పోటీ చేయించాలనుకుంటున్నారు. ఎలాగైనా సన్నీ పాజీని ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. కొంత కాలం కిందటి వరకు ధర్మేంద్ర తన సంతానం రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి అంత సుముఖంగా లేరనే వార్తలు వచ్చాయి. అయితే సన్నీ డియోల్, అమిత్ షాలు ఏం చర్చించారు? ఆ విశేషాలేంటనే విషయం ఇంకా స్పష్టంగా తెలియడం లేదు. కానీ షా పంజాబ్ లోని గురుదాస్ పూర్ లేదా అమృత్ సర్ వంటి ఏదైనా ప్రతిష్ఠాత్మక సీటు నుంచి సన్నీ డియోల్ ను ఎన్నికల బరిలో నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. 

సన్నీ డియోల్ బీజేపీలో చేరేదీ లేనిదీ ఇంకా తెలియడం లేదు. కానీ ధర్మేంద్ర 2004లో బీజేపీ టికెట్ పై బికనేర్ లోక్ సభ స్థానంలో గెలిచారు. ఆ తర్వాత ఆయనకు రాజకీయాలపై మోజు తీరిపోయింది. ఆయన భార్య హేమా మాలినీ బీజేపీలో చేరి 2014లో మథుర నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఇప్పుడు మరోసారి అదే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. హేమా మాలినీ బీజేపీ తరఫున రాజ్యసభ ఎంపీగా కూడా ఉన్నారు. ఇప్పుడు సన్నీ డియోల్ రాజకీయాల్లోకి వస్తే అది మరో ఆశ్చర్యకర పరిణామం కానుంది.