హైదరాబాద్ లో పోలింగ్ ఏర్పాట్లు పూర్తి

హైదరాబాద్ లో పోలింగ్ ఏర్పాట్లు పూర్తి

రాష్ట్రంలో మరికొద్ది గంటల్లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎన్నికల సిబ్బందిని పోలింగ్‌ కేంద్రాలకు తరలించేందుకు ప్రత్యేక వాహనాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఎన్నికల సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ నగరంలో 41లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి దాన కిషోర్ తెలిపారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని అన్నారు. 

'11 వందల పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ ఉంది. వికలాంగులకు, వృద్ధులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. ఎండల తీవ్రత దృష్ట్యా పోలింగ్ కేంద్రాలలో టెంట్స్, నీటి సౌకర్యం, ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఏర్పాటు చేశాం. ఓటు స్లిప్ రానున్న, ఓటర్ గుర్తింపు కార్డు లేకున్నా 11 రకాల ఐడీ కార్డుల్లో ఏది చూపెట్టిన ఓటు వేసేందుకు అనుమతి. మై జీహెచ్ఎంసీ యాప్ ద్వారా ఓటు ఎక్కడ ఉందో చూసుకోవచ్చు. హైదరాబాద్ కి మంచి పేరు ఉంది. ఓటర్లు అధిక సంఖ్యలో పాల్గొని దాన్ని నిలబెట్టాలి' అని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి దాన కిషోర్ పిలుపునిచ్చారు.