హుజూర్‌నగర్‌లో ముగిసిన ప్రచారం.. ఇక సైలెంట్‌గా..!

హుజూర్‌నగర్‌లో ముగిసిన ప్రచారం.. ఇక సైలెంట్‌గా..!

ఇటు అధికార టీఆర్ఎస్, అటు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో కీలకమైన ప్రచార కార్యక్రమానికి తెరపడింది.. సాయంత్రం 5 గంటలకు మైక్‌లు మూగబోయాయి.. ఇక, ఈ నెల 21వ తేదీన పోలింగ్ జరగనుండగా.. 24వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇప్పటి వరకు వివిధ పార్టీలకు చెందిన నేతలు, స్టార్ క్యాంపెయినర్లు ప్రచారాన్ని హోరెత్తించారు. రోడ్‌షోలు, సభలతో తమ ప్రణాళికలను ప్రజలముందు పెట్టారు. టీఆర్ఎస్ ఓ వైపు, కాంగ్రెస్ మరోవైపు, బీజేపీ, టీడీపీ అని తేడాల లేకుండా పార్టీ నేతలంతా ప్రచారంలో చెమడొచ్చారు. 

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి గెలుపొందిన పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. నల్గొండ ఎంపీగా వెళ్లడంతో హుజూర్ నగర్ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. హుజూర్ నగర్ లో గెలుపును అటు టీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. హుజూర్ నగర్ లో ఎలాగైనా ఈసారి గులాబీ జెండా ఎగురవేయాలని టీఆర్ఎస్ పట్టుదలతో ఉంటే కంచు కోట స్థానాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. పోటీ ప్రధానంగా ఈ రెండు పార్టీల మధ్యే కనిపిస్తోంది. కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య ఉత్తమ్ పద్మావతి, టీఆర్ఎస్ నుంచి సైదిరెడ్డి ఎన్నికల బరిలో ఉన్నారు. టీడీపీ, బీజేపీ కూడా ఇక్కడ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. బీజేపీ అభ్యర్దిగా డాక్టర్ కోట రామారావు, టీడీపీ నుంచి చావా కిరణ్మయి పోటీ చేస్తున్నారు. మొత్తం రెండు లక్షల 36 వేల మంది ఓటర్లు ఎల్లుండి జరిగే ఉప ఎన్నికల పోలింగ్‌లో విజేతను నిర్ణయిస్తారు. ఇక ప్రచారం ముగియడంతో.. ప్రలోభాలకు పాల్పడే అవకాశం ఉండడంతో.. అధికారులు వీటిని అడ్డుకోవడానికి ప్రత్యేకంగా దృష్టి సారించారు.