సోషల్ మీడియాకూ ఎన్నికల కోడ్ .. నేటి నుంచే అమల్లోకి

సోషల్ మీడియాకూ ఎన్నికల కోడ్ .. నేటి నుంచే అమల్లోకి

17వ లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోరా ఎన్నికల షెడ్యూల్‌పై వివరాలను వెల్లడిస్తున్నారు. లోక్‌సభతోపాటు 4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల షెడ్యూల్‌ వెలువడినందున తక్షణమే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిందని అరోరా చెప్పారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్నిరాష్ట్రాల ఎన్నికల అధికారులతో సమీక్షలు నిర్వహించామన్నారు. చీఫ్ సెక్రటరీ, పోలీసులతో వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించామని తెలిపారు. పండుగలు, పరీక్షల తేదీలను పరిగణనలోకి తీసుకుని షెడ్యూల్‌ను రూపొందించామన్నారు.

దేశ వ్యాప్తంగా 10 లక్షల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్న ఆయన.. దేశవ్యాప్తంగా 90కోట్ల ఓటర్లు ఉన్నారని చెప్పారు. అందులో తొలిసారి ఓటు వేసే వారు 1.5 కోట్ల మంది అని చెప్పారు. 99.36 శాతం మంది ఓటర్లు గుర్తింపు కార్డులు ఉన్నాయన్నారు. ఈవీఎం, వీవీ ప్యాట్ల ద్వారానే ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు.  ఓటు హక్కు వినియోగించుకోవడానికి 12 రకాల గుర్తింపు కార్డులను అనుమతిస్తామని.. ఫొటో ఓటరు స్లిప్‌ను గుర్తింపు కార్డుగా పరిగణించబోమని ఆయన స్పష్టం చేశారు. ఎవరైనా హింసాత్మక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల అభ్యర్థుల సోషల్ మీడియా ప్రకటనలకు కూడా ఎన్నికల కోడ్ వర్తిస్తుందని.. సోషల్ మీడియాలో వదంతులు ప్రచారం కాకుండా గట్టి చర్యలు చేపట్టామని చెప్పారు.