బతుకమ్మకు ఎన్నికల కోడ్ అడ్డు... 95లక్షల చీరలు రెడీ

బతుకమ్మకు ఎన్నికల కోడ్ అడ్డు... 95లక్షల చీరలు రెడీ

తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల కమిషన్ అకస్మాత్తు నిర్ణయంతో ప్రభుత్వం చేయాల్సిన పలు పనులకు కోడ్ బ్రేక్ వేయనుందని పలువురు భావిస్తున్నారు. ఈ ప్రభావం తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మపై కూడా పడనుంది. పండుగ సందర్భంగా  ప్రభుత్వం పేద మహిళలకు పంపిణీ చేస్తున్న బతుకమ్మ చీరలపై పంపిణీ అనుమానాస్పదంగా మారింది. ఇప్పటికే సుమారు 95లక్షల చీరలను ప్రభుత్వం సిరిసిల్లా టెక్స్ టైల్ క్లష్టర్ నుంచి కొనుగోలు చేసింది. ఇందుకోసం సుమారు రూ.280కోట్లు విడుదల చేసింది. తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ చీరలకు సంబంధించి ఎగ్జిబిషన్ ప్రారంభించేందుకు కొన్ని గంటలకు ముందే ఈసీ ఎన్నికల కోడ్ ను ప్రకటించింది. అయినా... అక్టోబర్ 12న చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని మంత్రి ప్రకటించారు. ఇప్పటికే ప్రభుత్వం 50లక్షల చీరలను కొనుగోలు చేసి పలు ప్రాంతాలకు పంపింది. మిగిలిన 45లక్షల చీరలు అక్టోబర్ 10నాటికి అన్ని ప్రాంతాలకు పంపుతామని మంత్రి తెలిపారు. ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకొనైనా  చీరలు పంపిణీ చేస్తామంటోంది ప్రభుత్వం

ఎన్నికల కోడ్ బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి అడ్డంకి కాదంటున్నారు. ఇది గతంలో జరిగిన కార్యక్రమమే అని చెబుతున్నారు. రైతు బంధు కార్యక్రమం లాగానే ఇది కూడా గతంలో నిర్వహించిన కార్యక్రమానికి కొనసాగింపే అని అధికార పార్టీ చెబుతోంది. అయితే... విపక్షాలు మాత్రం బతుకమ్మ చీరల పంపిణీ ఎన్నికలపై ప్రత్యక్ష ప్రభావం చూపనుండటంతో ఈసీ కలిసే అవకాశం ఉంది. రైతుబంధు చెక్కులు, బతుకమ్మ చీరల పంపిణీ చేయటంలో మాకు ఎలాంటి అభ్యంతరలేదు.. అయితే... అందులో ప్రభుత్వ ప్రమేయం ఉండకూడదని వాదిస్తున్నారు. ఎన్నికల కమిషన్ మాత్రం రైతు బంధు,బతుకమ్మ చీరల పంపిణీ స్కీమ్ లపై ఇంతవరకు స్పందించలేదు.