పోలింగ్, అంతకు ముందు రోజు ప్రకటన ప్రచురణపై నిషేధం

పోలింగ్, అంతకు ముందు రోజు ప్రకటన ప్రచురణపై నిషేధం

రాబోయే లోక్ సభ ఎన్నికల్లో ఏడు దశల్లోనూ పోలింగ్ రోజున, అంతకు ముందు రోజు పార్టీలు, అభ్యర్థులు, ఇతరులు రాజకీయ ప్రచార ప్రకటనలు ఇవ్వడాన్ని నిషేధిస్తూ ఎన్నికల సంఘం శనివారం ప్రకటన విడుదల చేసింది. ప్రకటనలకు స్క్రీనింగ్ కమిటీల ముందస్తు ధృవీకరణ తప్పనిసరని తెలిపింది. కమిషన్ తనకున్న రాజ్యాంగ అధికారాలను ఉపయోగించి ఈ నిర్ణయం తీసుకుంది. 2015లో బీహార్ ఎన్నికలపుడు మొదటిసారి ఈసీ ఇలాంటి నిర్ణయం తీసుకుంది.

గతంలో అభ్యంతరకరమైన, మోసపూరితమైన ప్రకటనలు ప్రింట్ మీడియాలో ప్రచురించిన సంఘటనలు తమ దృష్టికి వచ్చినట్టు ఎన్నికల సంఘం శనివారం తెలిపింది. 'ఎన్నికల చివరిదశలో అలాంటి ప్రచార ప్రకటనలు మొత్తం ఎన్నికల ప్రక్రియనే దెబ్బ తీస్తాయి. అలాంటపుడు ప్రభావిత అభ్యర్థులు, పార్టీలకు ఈ పరిస్థితిపై వివరణ ఇవ్వడం/ఖండించే అవకాశం కానీ ఉండదు' అని చెప్పింది.

ఏదైనా రెచ్చగొట్టే లేదా విద్వేషపూరిత ప్రచార ప్రకటన కారణంగా ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా తాను తనకున్న రాజ్యాంగ అధికారాలను ఉపయోగిస్తున్నట్టు ఈసీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. 'ఏ రాజకీయ పార్టీ లేదా అభ్యర్థి లేదా ఏ ఇతర సంస్థ లేదా వ్యక్తి' అన్ని దశల్లోనూ ఎన్నికల రోజు, అంతకు ముందు రోజు ఎలాంటి ప్రచార ప్రకటన ప్రచురించరాదు. అందులో పేర్కొన్న వివరాలను స్క్రీనింగ్ కమిటీలు ముందస్తు ధృవీకరిస్తేనే ప్రచురణార్హమని స్పష్టం చేసింది. 

ప్రస్తుతం పోలింగ్ ముగియడానికి చివరి 48 గంటల ముందు ఎన్నికల ప్రచార సామాగ్రిని ప్రసారం చేయడంపై ఎలక్ట్రానిక్ మీడియాపై నిషేధం ఉంది. ఎన్నికల రోజు, అంతకు ముందు రోజు రాజకీయ ప్రచార ప్రకటనలను నిషేధించాలన్న ఎన్నికల సంఘం ప్రతిపాదన ఎన్నో ఏళ్లుగా న్యాయ మంత్రిత్వశాఖ దగ్గర పెండింగ్ లో ఉంది.