అందరిచూపు నిజామాబాద్‌పైనే..!

అందరిచూపు నిజామాబాద్‌పైనే..!

సార్వత్రిక ఎన్నికల సమయంలో నిజామాబాద్‌ లోక్‌సభ స్థానం పెద్ద చర్చగా మారిపోయింది. దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. పెద్ద సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు వేయడం.. తమ డిమాండును జాతీయ స్థాయిలో చర్చ జరిగేలా చేయడమే లక్ష్యంగా బరిలోకి దిగడంతో నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికకు ప్రాధాన్యత పెరిగింది. దేశంలోనే అత్యధిక మంది అభ్యర్థులున్న పార్లమెంట్ సెగ్మెంట్‌గా నిలిచింది. మరోవైపు యుద్ధప్రతిపాదికన పోలింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. దేశ చరిత్రలో మొదటిసారి ఏమ్-3 మిషన్ వినియోగించనున్నారు. లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజవర్గాల్లో 15.50 లక్షల మంది ఓటర్లు ఉండగా.. ఇందులో రైతులే 2 లక్షల మంది వరకు ఉన్నారు. ఇక 1,788 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. బరిలో 185 మంది అభ్యర్థులుండగా... వారిలో 178మంది రైతులే కావడం మరో విశేషం. అభ్యర్థుల సంఖ్య అధికంగా ఉండటం వల్ల మొదటిసారి ఎన్నికల చరిత్రలోనే 12 బ్యాలెట్ యూనిట్లు వినియోగిస్తున్నారు. అంటే ప్రతీ పోలింగ్ కేంద్రంలో 12 బ్యాలెట్ యూనిట్లకు ఓ వివి ప్యాట్, ఓ కంట్రోల్ యూనిట్ అనుసందానం చేస్తారు. దీంతో 27 వేల బ్యాలెట్ యూనిట్లు, 2150 వీవీ ప్యాట్‌లు, 2150 కంట్రోల్ యూనిట్లు అందుబాటులో ఉంచారు. 

బ్యాలెట్ యూనిట్లకు ఏదైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే యుద్ధప్రతిపాదికన పరిష్కరించేందుకు అందుబాటులో బెల్ కంపెనికి చెందిన 600 ఇంజనీర్లను రప్పించింది ఎన్నికల కమిషన్. ఇక ఐదు పోలింగ్ కేంద్రాలకు కలిపి అందుబాటులో ఒక సెక్టోరల్ అధికారి, ఓ ఇంజనీర్ ఉంటారు. ఈ నియోజకవర్గంలో 25 వేల మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు మాక్ పోలింగ్‌ జరగనుండగా.. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అంటే సాయంత్రం 6 గంటల లోపు పోలింగ్ కేంద్రానికి చేరుకునే ప్రతీ ఒక్కరికి ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు. సాధారణంగా ఒకటి, రెండు ఈవీఎంలు వినియోగించిన సమయంలో ఓటు వేసేందుకు 30 సెకండ్ల సమయం పడుతుండగా.. నిజామాబాద్ నియోజకవర్గంలో 12 ఈవీఎంలను ఉపయోగిస్తున్నందున అదనంగా మరో 15 నుంచి 30 సెకండ్ల వరకు సమయం పటే అవకాశం ఉంది. ఈ ఎన్నికలకను ఛాలెంజ్‌గా తీసుకొని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. అత్యవసర పరిస్థితుల్లో వినియోగించడానికి హెలికాప్టర్‌ కూడా అందుబాటులో ఉంచారు. మరోవైపు పోలింగ్ కేంద్రాలలో ఎలాంటి అవాంచనీయ ఘటలు జరగకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. సమస్యాత్మక కేంద్రాల దగ్గర అదనంగా పోలీసు బలగాలను మోహరించారు. మొత్తానికి సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్ నియోజకవర్గం ప్రత్యేకతను, ప్రాధాన్యతను సంతరించుకుంది.