50 శాతం వీవీ ప్యాట్‌లు లెక్కించాల్సిందే..!

50 శాతం వీవీ ప్యాట్‌లు లెక్కించాల్సిందే..!

ఈవీఎంల పనితీరుపై ఎన్నో సందేహాలున్నాయన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్ లో ప్రతిపక్ష పార్టీల నాయకులు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కాంగ్రెస్ నేతలు కపిల్ సిబల్, అభిషేక్ మనుసింఘ్వి తదితరులు హాజరయ్యారు. సేవ్ డెమోక్రసీ , సేవ్ నేషన్ ,  ఈవిఎంల పని తీరుపై చర్చించిన తర్వాత మీడియాతో మాట్లాడిన చంద్రబాబు... ఏపీలో పోలింగ్‌ నిర్వహించడంలో ఎన్నికల సంఘం విఫలమైందని.. అనేక చోట్ల సమస్యలు ఏర్పడ్డాయి. ఓటు వేయడానికి ప్రజలు గంటల తరబడి క్యూలో నిలబడాల్సివచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా దేశాల్లో ఈవీఎంల స్థానంలో పేపర్‌ బ్యాలెట్‌ పోలింగ్‌నే నిర్వహిస్తున్నారని.. భారత్‌లోనూ పేపర్‌ బ్యాలెట్‌ పోలింగ్‌నే కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించాలని కోరుతున్నట్టు తెలిపారు చంద్రబాబు. 

రూ. 9 వేల కోట్లు ఖర్చు పెట్టి వీవీప్యాట్‌లు కొన్నారు.. అంత ఖర్చు పెట్టి కేవలం ఒక్క వీవీప్యాట్‌లో స్లిప్పులు మాత్రమే లెక్కించడం ఏంటీ? అని ప్రశ్నించారు చంద్రబాబు. ఈవీఎంల పనితీరుపై చాలా సందేహాలున్నాయన్న ఆయన.. వీవీపాట్ లో గుర్తు 7 సెకండ్లు పాటు ఓటరుకు కనపడాల్సి ఉండగా,  కేవలం మూడు సెకండ్లు మాత్రమే కనిపిస్తుందని.. సమయం ఎందుకు తగ్గింది అని అడిగితే ఈసీ దగ్గర సమాధానం లేదని మండిపడ్డారు. ఎన్నికల నిర్వహణలో కేంద్ర ఎన్నికల సంఘం తీరు సంతృప్తికరంగా లేదన్న చంద్రబాబు.. సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసేందుకు ఆలోచిస్తున్నామని.. 50 శాతం వీవీప్యాట్‌లు లెక్కించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయని వెల్లడించారు.