ఎలక్షన్‌ కమిషనర్‌ సంచలన లేఖ

ఎలక్షన్‌ కమిషనర్‌ సంచలన లేఖ

కేంద్ర ఎన్నికల సంఘం పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ  కేంద్ర ఎన్నికల కమిషనర్‌ అశోక్‌ లవాసా రాసిన లేఖ ఇపుడు సంచలనం రేపుతోంది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌సహా కమిషన్‌లో ముగ్గురు సభ్యలు ఉన్నారు. సునీల్‌ అరోరా చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ కాగా, అశోక్‌ లావాసా, సుశిల్‌ చంద్ర మిగిలిన ఇద్దరు కమిషనర్లు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించినట్లు వచ్చిన ఫిర్యాదుల విచారణలో తన అభిప్రాయాన్ని కమిషన్‌ రికార్డుల్లో నమోదు చేయకపోవడంపై అశోక్‌ లవాసా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మెజారిటీ సభ్యలు ఒక నిర్ణయానికి వచ్చినా... అసమ్మతి వ్యక్తం చేసిన కమిషనర్‌ అభిప్రాయాన్ని రికార్డుల్లో నమోదు చేయాల్సి ఉంటుందని, కాని కమిషనర్‌ ఆ పనిచేయడం లేదని లవాసా మే 4వ తేదీన ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు లేఖ రాశారు. 

తన అభిప్రాయం నమోదు కాని భేటీలకు తాను హాజరు కాలేని పరిస్థితిని ఉత్పన్నం చేశారని ఆయన తన లేఖలో ఆరోపించారు. సాధారణంగా ఎన్నికల సంఘంలో నిర్ణయాలు ఏకాభిప్రాయంతో ఉంటాయని, ఒకవేళ ఏకాభిప్రాయ కుదరని పక్షంలో మైనారిటీ సభ్యుని అభిప్రాయం నమోదుకు అవకాశం ఉంటుంది. లేఖ రాసిన తరవాత ప్రధాని ఎన్నికల అధికారి అరోరాతో లవాసా భేటీ అయ్యారు. ఎన్నికల సంఘం పనితీరు చట్టబద్ధంగా ఉండేందుకు అవసరమైతే తగిన చర్యలు తీసుకునేందుకు కూడా తాను వెనుకాడనని లవాసా తన లేఖలో పేర్కొన్నారు. 

వివిధ అంశాలపై మరింత జవాబుదారీతనం కోసం తాను వెలిబుచ్చిన అభిప్రాయాలతో పాటు మైనారిటీ అభిప్రాయాన్ని కూడా రికార్డుల్లో  నమోదు చేయాలన్న తన విజ్ఞప్తిని ఎన్నికల సంఘం పట్టించుకోలేదని లవాసా తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయ సంబంధిత అంశాలపై మాత్రమే మైనార్టీ అభిప్రాయాలను నమోదు చేస్తారని, ఎన్నికల ప్రవర్తన నియమావళికి సంబంధించిన అంశాలు న్యాయ సంబంధిత అంశాలు కావని ఎన్నికల సంఘం అంటోంది. అందుకే మైనారిటీ అభిప్రాయాలను నమోదు చేయలేదని సమర్థించుకుంటోంది.