ఎన్నికల ఎఫెక్ట్‌.. డల్‌గా స్టాక్‌ మార్కెట్‌

ఎన్నికల ఎఫెక్ట్‌.. డల్‌గా స్టాక్‌ మార్కెట్‌

అంతర్జాతీయ మార్కెట్లలో ఉత్సాహం మన మార్కెట్లలో కొరవడింది. కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మార్కెట్‌లో టెన్షన్‌ నెలకొంది. రాత్రి అమెరికా మార్కెట్లు ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి. అలాగే ఆసియా మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నాయి. చైనా మినహా మిగిలిన ప్రధాన మార్కెట్లు ఒకశాతం వరకు లాభపడ్డాయి.  జపాన్‌ నిక్కీ, హంగ్‌సెంగ్‌ సూచీలు 1.5 శాతం వరకు లాభంతో ట్రేడవుతున్నాయి.  కర్ణాటకలో బీజేపీ విజయావకాశాలపై ఇన్వెస్టర్లలో టెన్షన్‌ కన్పిస్తోంది. ఈ రాష్ట్రంలో బీజేపీ గనుక అధికారంలోకి రాకుంటే... దీని ప్రభావం మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాలపై ఉంటుందని ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. దీంతో అధిక స్థాయిల వద్ద దూరంగా ఉంటున్నారు. నిఫ్టి ఏమాత్రం పెరిగినా అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. నిఫ్టి 14 పాయింట్ల లాభంతో 10731 వద్ద ట్రేడవుతోంది. చమురు ధరలు నిలకడగా ఉండటంతో ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌పీసీఎల్‌, ఐఓసీ, బీపీసీఎల్‌, కోల్‌ ఇండియా షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఇక నష్టపోయిన నిఫ్టి షేర్లలో భారతీ ఎయిర్‌టెల్‌ ముందుంది. ఈ షేర్‌ సుమారు 5 శాతం నష్టపోయింది. సన్‌ ఫార్మా రెండుశాతం తగ్గింది. హిందాల్కో, లుపిన్‌, బజాజ్‌ ఆటోలు స్వల్ప నష్టాలతో ట్రేడవుతున్నాయి.