ఈసీపై దుష్ప్రచారం చేస్తున్నారు

ఈసీపై దుష్ప్రచారం చేస్తున్నారు

కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పూర్తి పారదర్శకంగా పనిచేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ స్పష్టంచేశారు. ప్రజాస్వామిక స్ఫూర్తికి విఘాతం కలిగేలా కొందరు సోషల్ మీడియాలో ఈసీపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పోలింగ్‌ శాతాలతో పాటు పలుచోట్ల ఈవీఎంల తరలింపు తదితర అంశాలపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలింగ్‌ పూర్తయిన వెంటనే సాయంత్రం 5గంటలకు అంచనా వివరాలు ఇస్తామని.. తర్వాతి రోజు మాత్రమే పోలింగ్‌ శాతాలపై స్పష్టమైన సమాచారం ఇవ్వగలమని అన్నారు. పోలింగ్‌ ముగిసే ముందు ఫారం 17సీ కాపీలు పోలింగ్‌ ఏజెంట్లకు అందిస్తామని.. దానిపై వాళ్ల సంతకాలు సైతం ఉంటాయన్నారు. ఫారం 17ఏ, ఫారం 17సీని సరిచూసుకున్న తర్వాత కూడా అనవసర రాద్ధాంతం చేయడం తగదని మండిపడ్డారు. జగిత్యాలలో ఆటోలో తరలించిన ఈవీఎంలు శిక్షణ కోసం వినియోగించినవేనని రజత్‌కుమార్‌ స్పష్టంచేశారు.  ప్రతిఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, అవాస్తవాలు ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేశారు.