నా ప్రతి క్షణం దేశ సేవకే సమర్పణం

నా ప్రతి క్షణం దేశ సేవకే సమర్పణం

తన జీవితంలో ప్రతి క్షణాన్ని దేశ సేవకే సమర్పిస్తానని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిజ్ఞ చేశారు. తన కోసం తాను ఏం చేసుకోనని.. ఏం చేసినా అంతా దేశం కోసమే చేస్తానని ప్రతిన బూనారు. తాను ఎవరిపైన ద్వేషం, ప్రతీకారంతో పని చేయబోనని.. తానెక్కడైనా తప్పు చేస్తే విమర్శించి సరిదిద్దాల్సిందిగా ఆయన కోరారు. ఇలాంటి స్పష్టమైన తీర్పునిచ్చినందుకు 130 కోట్ల మంది దేశప్రజలకు మోడీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఎండలు మండిపోతున్నా ఈ ఎన్నికల్లో అత్యధిక ఓటింగ్ నమోదవడం భారత ప్రజాస్వామ్యంలోని బలాన్ని రుజువు చేస్తోందన్నారు. ఇవాళ ప్రజలంతా తాము దేశం కోసం నిలబడతామని చెప్పారని, ఈ ఎన్నికల్లో ఎవరైనా గెలిచారంటే అది భారతదేశం, దాని ప్రజలు మాత్రమేనని మోడీ చెప్పారు. ఈ విజయాన్ని బీజేపీతో పాటు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల తరఫున దేశ ప్రజలకు అంకితం ఇస్తున్నానని తెలిపారు. తామెప్పుడూ మార్గం నుంచి పక్కకు పోలేదని, పార్లమెంటులో రెండు సీట్లతో మొదలైన తమ ప్రయాణం రెండోసారి అధికారం చేపట్టే వరకు వచ్చిందన్నారు. మెజారిటీతో ఏర్పడిన ప్రభుత్వం ప్రతి ఒక్కరి ఆమోదంతోనే దేశాన్ని ముందుకు తీసుకెళ్లగలదని ప్రజాస్వామ్యం చెబుతుందంటూ.. ప్రజలు తమకు ఇచ్చిన తీర్పును వినమ్రంగా స్వీకరించి అందరినీ కలుపుకొని నడుస్తామని వాగ్దానం చేశారు. 

ప్రధాని మోడీ ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనవిజయం అందించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీని విజయపథంలో నిలిపేందుకు అహరహం కృషి చేసిన కార్యకర్తలను అభినందించారు. మోడీ ప్రసంగం ప్రారంభించబోగానే కార్యకర్తలంతా మోడీ మోడీ నినాదాలతో హోరెత్తించారు. రాజకీయ పండితుల 20వ శతాబ్దపు ఆలోచనా విధానాన్ని వదిలేయాలని మోడీ కార్యకర్తలకు సూచించారు. దేశప్రజలకు ఆహారం అందించేందుకు రాత్రింబవళ్లు కష్టపడే రైతులకు ఈ విజయం చెందుతుందని చెప్పారు. దేశంలో మొదటిసారిగా ఎన్నికల్లో ద్రవ్యోల్బణం ప్రధాన అంశం కాలేదని గుర్తు చేశారు. అందుకోసం తామెంతో కష్టపడ్డామని వివరించారు. 2014 నుంచి లౌకికవాదం ముసుగులు వేసుకున్నవాళ్లు దేశప్రజల్లో తమ అబద్ధాలను ప్రచారం చేయలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు దేశంలో ఉన్నవి రెండే కులాలని-నిరుపేదలు, వాళ్లని పేదరికం నుంచి బయటికి తెచ్చేందుకు పోరాడుతున్నవాళ్లని అన్నారు.