బెంగాల్ లో ఎగసిన కాషాయ కెరటం

బెంగాల్ లో ఎగసిన కాషాయ కెరటం

బెంగాల్ లో కాషాయ కెరటం ఉవ్వెత్తున ఎగసి పడింది. రాష్ట్రంలోని 42 లోక్ సభ స్థానాలకు గత ఎన్నికల్లో 2 ఎంపీ స్థానాలు గెలుచుకున్న బీజేపీ ఈ ఎన్నికల్లో ఏకంగా 16 స్థానాలు నెగ్గే దిశగా దూసుకుపోతోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ తో ఓట్ల షేర్ ను గణనీయంగా తగ్గించింది. టీఎంసీ 25 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. 2014 ఎన్నికల్లో బెంగాల్ లో రెండు 2 సీట్లు గెలిచిన కాంగ్రెస్ కు ఈ సారి కేవలం ఒక్క స్థానానికే పరిమితం అయ్యేలా ఉంది. 

2012 నుంచి పశ్చిమ బెంగాల్ లో తిరుగులేని నాయకురాలిగా చక్రం తిప్పుతున్న మమతకు ఇది పెద్ద షాక్ కాగలదు. గత కొన్నేళ్లుగా నిర్విరామంగా రాష్ట్రంలో పాగా వేసేందుకు కమల దళం చేస్తున్న ప్రయత్నాలు ఎట్టకేలకు మంచి ఫలితాలను ఇస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. మూడు దశాబ్దాలకు పైగా లెఫ్ట్ పాలనలో ఉన్న బెంగాల్ ఇప్పుడు రైట్ టర్న్ తీసుకుంటోందని ఈ పరిణామాలను గమనిస్తున్న విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో లెఫ్ట్ కు ఉన్న 30 శాతం ఓట్ షేర్ తృణమూల్ కు కాకుండా బీజేపీకి బదిలీ అయిందని విశ్లేషిస్తున్నారు. 

రాష్ట్రంలో ఎంపీ సీట్ల సంఖ్య ఎనిమిది రెట్లు పెరగడంతో కాషాయ దళంలో ఉత్సాహం ఉరకలేస్తోంది. ఇక 2021లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ ఇదే ఊపును కొనసాగించే అవకాశాలు ఉన్నాయి.