ఇది మోడీ సునామీ!!

ఇది మోడీ సునామీ!!

లోక్ సభ ఎన్నికల్లో నరేంద్ర మోడీ హవా కాదు సునామీ వచ్చింది. ఈ సునామీ ధాటికి ప్రతిపక్షాలు కకావికలం అయిపోయాయి. 2014 ఎన్నికల్లో మోడీ వేవ్ కంటే బలంగా ఈ ఎన్నికల్లో విపక్ష శ్రేణులను తాకింది. దీంతో బీజేపీ గత ఎన్నికల్లో కంటే ఘన విజయం సాధించింది. దేశవ్యాప్తంగా లోక్ సభకు జరిగిన ఎన్నికలు ఎంపీలను కాకుండా దేశప్రధానిని ఎన్నుకొనేందుకు జరిగినట్టు తలపించాయి. ప్రజలు అభ్యర్థి ఎవరనేది కాకుండా మోడీని చూసి ఓటేసినట్టు కనిపిస్తోంది. బీజేపీ సైతం మోడీని ప్రధానమంత్రి అభ్యర్థిగా చూపించి ఓట్లు అడిగింది. ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వ విధానాలు, విధానపరమైన లోపాలు వంటి వాటిపై కాకుండా మోడీపై దాడికి దిగడంతో ఈ ఎన్నికలు కేవలం మోడీ చుట్టూనే తిరిగాయి. ముఖ్యంగా విపక్ష పార్టీలు నరేంద్ర మోడీకి ప్రత్యామ్నాయంగా ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరనేది ప్రజలకు వివరించడంలో దారుణంగా విఫలమయ్యాయి.

మోడీ హవా ఇంత బలంగా వీచడానికి అనేక కారణాలను పేర్కొంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కేంద్రంలో అధికారానికి మార్గంగా భావించే ఉత్తరప్రదేశ్ లో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ పెద్దగా సీట్లు నష్టపోకపోవడం మొదటిది. సమాజ్ వాదీ పార్టీ-బహుజన్ సమాజ్ పార్టీ మహాకూటమిగా ఏర్పడి బరిలోకి దిగినపుడు యాదవ్, జాతవ్, ముస్లింల ఓట్లు గుండుగుత్తగా కూటమి ఖాతాలో పడతాయని దీంతో కమల దళం భారీగా నష్టపోనున్నట్టు అంచనాలు వెలువడ్డాయి. కానీ ఇతర ఓబీసీలు, జాతవేతరులు, అగ్రవర్ణాల ఓట్లు గంపగుత్తగా కాషాయ దళానికి పడ్డాయి. మహాకూటమిలోకి కాంగ్రెస్ చేర్చుకోకపోవడం మరో కారణంగా చెప్పవచ్చు. ఉత్తరప్రదేశ్ లో సంప్రదాయికంగా ముస్లిం ఓటు బ్యాంకు కాంగ్రెస్ వైపే ఉంటూ వస్తోంది. ఇప్పుడు తాజా పరిణామాల నేపథ్యంలో మహాకూటమిలో చోటు దక్కని కారణంగా కాంగ్రెస్ వేరుగా పోటీ చేసింది. గత ఎన్నికల్లో యుపిలో రెండు స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్ ఈ సారి రాష్ట్రంలో పార్టీ ఉనికిని చాటుకోవడంతో పాటు, రాబోయే శాసనసభ ఎన్నికల నాటికి సంస్థాగతంగా బలోపేతం అయ్యేందుకు దాదాపు అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది. దీంతో ముస్లిం ఓట్లు, మహాకూటమి ఓట్లు పరస్పరం చీలిపోయి బీజేపీ లాభపడింది. 

డిసెంబర్ శాసనసభ ఎన్నికల్లో హిందీ రాష్ట్రాలైన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ లలో బీజేపీ ప్రభుత్వాలను గద్దె దించిన జోష్ లో ఉన్న కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికలకు సరైన విధంగా సన్నద్ధం కాలేదు. అటు బీజేపీ మాత్రం ఓటమిని లోతుగా విశ్లేషించుకొని సత్వరమే దిద్దుబాటు చర్యలు తీసుకొంది. కమలం పార్టీ ఆయా రాష్ట్రాల్లో సమర్థవంతంగా పార్టీకే కాకుండా దేశాన్ని ముందుకు నడపగల నాయకుడు మోడీ ఒక్కడే అని ప్రజలకు వివరించడంలో సఫలమయ్యాయి. ఎప్పటిలాగే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అంతర్గత కుమ్ములాటలు, ఆధిపత్య పోరు కొనసాగాయి. అటు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్థానిక నాయకత్వంలో నివురు గప్పిన నిప్పులా సెగలు కక్కుతున్న విభేదాలను పరిష్కరించడంలో విఫలమయ్యారు.

పశ్చిమ బెంగాల్ విషయానికొస్తే రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా చక్రం తిప్పుతున్న తృణమూల్ కాంగ్రెస్ కి బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదిగింది. టీఎంసీ అగడాలతో విసుగెత్తిన ప్రజలు దాదాపుగా స్తబ్దుగా మారిన సీపీఎం స్థానంలో బీజేపీ ఉంటే మేలని భావించారు. టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ జనాభాలో నాలుగో వంతు ఉన్న ముస్లింలను మెప్పించే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారనే రగిలిపోతున్న మెజారిటీ ప్రజలు బీజేపీవైపు మొగ్గారు. గత ఎన్నికల్లో రెండు సీట్లు సాధించిన కాషాయ దళం ఈ సారి తన హిందూత్వ వాదానికి మరింత పదును పెట్టి ముందుకొచ్చింది. దుర్గా పూజ, హిందువుల పండుగలను ఘనంగా బలప్రదర్శన జరుపుతూ నిర్వహించడం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైనా ఆటంకం వస్తే దానిని గోరంతలు కొండంతలు చేయడం మెజారిటీ హిందువులను ఆకట్టుకుంది. ప్రధాని మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ప్రధాన ప్రచారకర్తలుగా మారి తరచు బెంగాల్ లో పర్యటించడం బాగా కలిసి వచ్చింది. అనేక సందర్భాలలో టీఎంసీ, బీజేపీ ఒక దానితో మరొకటి పరస్పర దాడులకు దిగేందుకు కూడా వెనుకాడకపోవడం చూసిన హిందువుల ఓట్లు తృణమూల్ ను ఢీ కొనేందుకు కేంద్రం అధికారంలో ఉన్న కమలం పార్టీనే సరైనదని భావించినట్టు కనిపిస్తోంది. దీంతో ఏకంగా 18 సీట్లు కాషాయం పార్టీ ఖాతాలో చేరాయి.

పశ్చిమ బెంగాల్ ప్రభావం ఇటు పొరుగున ఉన్న ఒడిషాలోనూ కనిపించింది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బిజూ జనతాదళ్ కు తిరుగులేని ఆధిక్యంతో మరోసారి పట్టం కట్టిన ఓటర్లు లోక్ సభ ఎన్నికల్లో మాత్రం బీజేపీ వైపు బాగానే మొగ్గు చూపారు. గత ఎన్నికల్లో ఒక్క సీటు మాత్రమే గెలిచిన కమల దళానికి ఈ సారి 6 సీట్లు ఇచ్చారు. బీహార్, మహారాష్ట్రలలో జేడీయు, శివసేనలతో బీజేపీ ఎన్నికల ప్రకటన వెలువడటానికి కొన్ని నెలల ముందే కుదుర్చుకొన్న పొత్తులు బాగా ఉపయోగపడ్డాయి. భాగస్వామ్య పక్షాలు సైతం మోడీనే ప్రధానమంత్రి అభ్యర్థిగా చూపుతూ చేసిన ప్రచారం ఓటర్లపై మంచి ప్రభావం చూపినట్టు భావిస్తున్నారు.

దక్షిణాదిన తెలంగాణలో 4, కర్ణాటకలో 26 సీట్లు సాధించడం, ఈశాన్య రాష్ట్రాల్లో బలమైన శక్తిగా ఎదగడం వెనుక మోడీ ఇమేజ్ మాత్రమే బలంగా పని చేసిందని చెబుతున్నారు. గత ఎన్నికల్లో మిగతా పార్టీలన్నిటికీ వచ్చిన ఓట్ షేర్ బీజేపీ కంటే ఎక్కువగా ఉండగా ఈ సారి బీజేపీకి వచ్చిన ఓటింగ్ 56.6 శాతంగా ఉంది. దీనిని బట్టి గత ఎన్నికల కంటే బలంగా ప్రజలు బీజేపీని ముఖ్యంగా ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి మోడీని నమ్మినట్టు భావించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నికల సంఘం విడుదల చేసిన సరళులను బట్టి చూస్తే బీజేపీ 298 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా కాంగ్రెస్ సుదూరాన 51 సీట్లతో వెనుకంజలో ఉంది. తుది ఫలితాల వరకు ఇదే సరళి కొనసాగితే బీజేపీ 2014లో సాధించిన 282 సీట్ల సంఖ్యను మరింత మెరుగుపరచుకొనే అవకాశం ఉంది. అదే జరిగితే 543 మంది సభ్యుల లోక్ సభలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత సంఖ్యాబలం చేకూరుతుంది. ఇక ఇతర భాగస్వామ్య పక్షాలతో కలుపుకొంటే ఎన్డీఏ సీట్ల సంఖ్య 349కి చేరవచ్చు. 2014లో ఇది 336గా ఉంది.