కౌంటింగ్‌ ప్రక్రియ ఇలా..

కౌంటింగ్‌ ప్రక్రియ ఇలా..

సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు మరో గంటలో ప్రారంభంకానుంది.  ఇవాళ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. దేశవ్యాప్తంగా 542 లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు నాలుగు రాష్ట్రాల పరిధిలోని 414 అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలలో ఓట్లను లెక్కించనున్నారు. తొలిసారిగా ఈసారి ఈవీఎంలతోపాటు వీవీప్యాట్‌లు కూడా లెక్కించబోతున్నారు. ముందుగా ఈవీఎంలను లెక్కించిన తర్వాత ర్యాండమైజేషన్‌ ప్రక్రియ ద్వారా లాటరీ తీసి ఎంపిక చేసిన 5 వీవీప్యాట్ల లెక్కింపు చేపడతారు. ప్రతి లెక్కింపు కేంద్రంలో 14 నుంచి 15 టేబుళ్ల వరకూ ఏర్పాటు చేస్తారు. ఈ టేబుళ్లపైన ఈవీఎంలు ఉంచి ఓట్లు లెక్కిస్తారు. పోలింగ్‌ కేంద్రాలను బట్టే 18 నుంచి 20 రౌండ్ల వరకూ కౌంటింగ్‌ సాగుతుంది. అందుకే ఈసారి అధికారికంగా ఫలితాలు వెల్లడయ్యేసరికి రాత్రి 8-10 గంటలయ్యే  అవకాశముంది.  

  • ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది.
  • తొలుత  పోస్టల్‌ బ్యాలట్‌ ఓట్లు లెక్కిస్తారు. 
  • ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు ఉదయం 8.30 గంటలకు ప్రారంభిస్తారు. 
  • ఒక్కో శాసనసభ నియోజకవర్గానికి 14 నుంచి 15 కౌంటింగ్‌ టేబుళ్లు ఏర్పాటు చేస్తారు. 
  • ఈవీఎంల లెక్కింపు పూర్తయ్యాక వీవీప్యాట్‌ స్లిప్‌ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభిస్తారు.
  • ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 5 పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించిన వీవీ ప్యాట్ల స్లిప్‌లను లెక్కిస్తారు. 
  • ఒక్కో వీవీ ప్యాట్‌లోని స్లిప్‌లను లెక్కించడానికి సుమారు గంట పడుతుందని అంచనా.
  • ప్రతి కౌంటింగ్‌ కేంద్రం వద్ద రౌండ్లవారీగా ఫలితాలు తెలియజేయడానికి కౌంటింగ్‌ కేంద్రానికి 300 మీటర్ల దూరంలో ఎన్నికల సంఘం డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేయనుంది.