ప్రధాని మోడీకి పరువు నష్టం నోటీసులు

ప్రధాని మోడీకి పరువు నష్టం నోటీసులు

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్ కాంగ్రెస్ నేత అభిషేక్ బెనర్జీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తన న్యాయవాది ద్వారా పరువు నష్టం నోటీసులు పంపారు. మే 15న డైమండ్ హార్బర్ లో నిర్వహించిన బహిరంగ సభలో తనపై ప్రధాని మోడీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని అభిషేక్ బెనర్జీ ఆరోపించారు. లోక్ సభ ఎన్నికల సందర్భంగా బీజేపీ, టీఎంసీల మధ్య హోరాహోరీ పోరు సాగుతున్న నేపథ్యంలో ఈ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.

కోల్ కతాలో అమిత్ షా రోడ్ షో సందర్భంగా హింసకాండ జరిగిన తర్వాత ఎన్నికల సంఘం జోక్యం చేసుకొని పశ్చిమ బెంగాల్ చివరి దశ ఓటింగ్ కి ప్రచారాన్ని ఒక రోజు తగ్గించింది. టీఎంసీలో నెంబర్ టూగా చెప్పుకొనే ఎంపీ అభిషేక్ బెనర్జీ డైమండ్ హార్బర్ నుంచి రెండోసారి పోటీ చేస్తున్నారు. ఆయన బీజేపీ అభ్యర్థి నీలాంజన్ రాయ్ తో తలపడుతున్నారు. అభిషేక్ బెనర్జీపై తీవ్ర విమర్శలు చేస్తూ ప్రధాని మోడీ ఈ సారి ఆయన ఎన్నికల్లో ఓడిపోతారని, ఫలితాలు ప్రకటించిన తర్వాత ఆయన కార్యాలయానికి తాళం పడుతుందని అన్నారు.

డైమండ్ హార్బర్ లో మోడీ 'పశ్చిమ బెంగాల్ లో అత్త-మేనల్లుళ్ల ప్రభుత్వం నడుస్తోందని' విమర్శించారు. లోక్ సభ ఎన్నికల చివరి దశలో మే 19న బెంగాల్ లోని 9 సీట్లు-డమ్ డమ్, బర్సాత్, బసీర్హాట్, జయ్ నగర్, మథురాపుర్, జాదవ్ పూర్, డైమండ్ హార్బర్, దక్షిణ, ఉత్తర కోల్ కతాలలో ఓటింగ్ జరగనుంది. మే 23న లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.