'బెడ్ టీ తాగలేదు..అందుకే తెలియదు' అసన్ సోల్ హింసపై మున్ మున్ వ్యాఖ్య

'బెడ్ టీ తాగలేదు..అందుకే తెలియదు' అసన్ సోల్ హింసపై మున్ మున్ వ్యాఖ్య

లోక్ సభ ఎన్నికల నాలుగో దశలో 9 రాష్ట్రాల్లోని 72 లోక్ సభ సీట్లకు ఓటింగ్ జరుగుతోంది. పశ్చిమ బెంగాల్ లో ఉద్రిక్త వాతావరణ కొనసాగుతోంది. అసన్ సోల్ లో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) కార్యకర్తల మధ్య హింసాత్మక సంఘర్షణలు జరిగాయి. రెండు పార్టీలు ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. అసన్ సోల్ నుంచి టీఎంసీ అభ్యర్థి మున్ మున్ సేన్ విచిత్రమైన వ్యాఖ్య చేశారు. తాను రాత్రి ఆలస్యంగా పడుకున్నానని చెప్పిన మున్ మున్, పొద్దున్న తనకు బెడ్ టీ ఆలస్యంగా ఇవ్వడంతో ఈ హింసాకాండ ఘటన గురించి తనకు ఏ సమాచారం తెలియదని తెలిపారు.

సోమవారం ఉదయం తనకు ఆలస్యంగా బెడ్ టీ వచ్చిందని, అందువల్ల తను ఆలస్యంగా నిద్ర లేచినట్టు మున్ మున్ సేన్ చెప్పారు. ఈ హింస గురించి తనకసలేం తెలియదన్నారు. ఎన్నికల్లో హింస ఎందుకు జరుగుతోందని అడిగితే ఇదే టీఎంసీ అభ్యర్థి 'కమ్యూనిస్ట్ ప్రభుత్వంలో హింస జరిగిన రోజులపుడు మీరంతా చిన్నపిల్లలుగా ఉండి ఉంటారు. అప్పుడు ఒక్క బెంగాల్ లోనే కాదు పూర్తి దేశమంతా హింసాకాండ జరిగేది' అన్నారు. కానీ ప్రస్తుత సంఘటన, హింసాకాండ పై ఎలాంటి వ్యాఖ్య చేయకుండా మున్ మున్ సేన్ తప్పించుకుపోయారు.

అసన్ సోల్ లో ఓటింగ్ ప్రారంభమైన కాసేపటికే బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య హింసాకాండ, సంఘర్షణలు చెలరేగాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసులు లాఠీచార్జీ చేయాల్సి వచ్చింది. ఈ హింసాకాండలో బీజేపీ అభ్యర్థి బాబుల్ సుప్రియో వాహనం ధ్వంసమైంది. తనపై దాడి చేయడానికి టీఎంసీ కార్యకర్తలు ప్రయత్నించారని సుప్రియో ఆరోపించారు.