తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ‌ప్రారంభం

తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ‌ప్రారంభం

తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఏపీలోని175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలతో పాటు తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాల్లో ఇవాళ ఎన్నికలు నిర్వహించనున్నారు. 

ఆంధ్రప్రదేశ్ లో..
ఆంధ్రప్రదేశ్‌లో 3 కోట్ల 93లక్షల 45 వేల 717 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. దీని కోసం 46 వేల 120 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 2,118 మంది..  25 లోక్‌సభ నియోజకవర్గాలకు 319 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం  విశాఖ జిల్లాలోని అరకు, పాడేరు నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు, మిగిలిన నియోజకవర్గాల్లో యథావిధిగా ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. సుమారు 10 లక్షల మంది యువత తొలిసారిగా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అంతేకాకుండా 5 లక్షల 27 వేల మంది వరకూ దివ్యాంగులు ఓటర్లుగా నమోదయ్యారు. వీరి కోసం ఈసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 56,908 మంది సర్వీసు ఓటర్లు , 5,323 మంది ప్రవాసాంధ్రులు కూడా ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. 

తెలంగాణలో..
రాష్ట్రంలో 2,97,08,599 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి 34,604 పోలింగ్‌స్టేషన్లు ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించడానికి 2.80 లక్షల మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. పర్యవేక్షణకు మూడు హెలికాప్టర్లను కూడా ఉపయోగించనున్నారు. అలాగే అటవీ ప్రాంతాల్లో విధుల్లోఉన్న సిబ్బందికి ఏమైనా అనారోగ్య పరిస్థితులు ఏర్పడితే వెంటనే ప్రాథమిక చికిత్స అందించడం కోసం ఎయిర్ అంబులెన్స్‌లను అందుబాటులో పెడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగనున్నది. రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాలకు మొత్తం 443 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు.  మొత్తంగా 25 మంది మహిళలు పోటీలో ఉన్నారు.  టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలు మొత్తం 17 స్థానాలకు పోటీచేస్తుండగా.. ఎంఐఎం ఒక స్థానంలో, బీఎస్పీ 5, సీపీఐ 2, సీపీఎం 2 చోట్ల బరిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి.