విద్యుత్ చార్జీలు పెరగవు

  విద్యుత్ చార్జీలు పెరగవు

రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంచబోమని తెలిపారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. రాష్టంలో సోలార్.. విండ్ పవర్ తో విద్యుత్ కొరత లేకుండా చేశామన్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో పర్యటించిన ఆయన... హంద్రీనీవా నీళ్లతో జిల్లా పశ్చిమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. ఆసియా ఖండంలోనే టమోటా మార్కెట్ కు ప్రసిద్ధిగాంచిన మదనపల్లెలో రైతులకోసం మరిన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. టెక్నాలజీతో ముందుగానే వర్షాలు, పిడుగులపై ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని పేర్కొన్నారు. పుంగనూరు నియోజకవర్గ పరిధిలో చండ్రమాకుల పల్లెను అధికారులు, ప్రజల సమిష్టి కృషితో 11 స్టార్ గ్రామంగా తీర్చిదిద్దడం అభినందనీయమని స్పష్టం చేశారు. రాష్ట్రానికి.. ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసిందని విమర్శించారు. 29 సార్లు ఢిల్లీ వెళ్లి.. ప్రత్యేక హోదా కావాలని అడిగినా పట్టించుకోలేదని తెలిపారు.  తిరుమల శ్రీవారి.. ఆలయాన్ని కేంద్ర ఆధీనంలోకి తీసుకోవాలని కుట్ర చేశారని ఆరోపించారు. ఈ కుట్రలను సాగనివ్వమని ఆగ్రహం వ్యక్తం చేశారు.  2003 లో తీవ్రవాదులు హత్యా ప్రయత్నం చేసినా.. శ్రీవారి దయ, కటాక్షంతో బతికానని గుర్తుచేశారు. స్వామిపై అపార భక్తి ఉన్న తాను ఆలయ పవిత్రతకు భంగం కలగనివ్వనని చంద్రబాబు చెప్పారు.