ముగిసిన మూడో రోజు ఆట : పుంజుకున్న సౌతాఫ్రికా

ముగిసిన మూడో రోజు ఆట : పుంజుకున్న సౌతాఫ్రికా

భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి సఫారీ జట్టు 8 వికెట్ల నష్టానికి 385 పరుగులు చేసి భారత్‌ కంటే 117 పరుగుల వెనుకంజలో ఉంది. 39/3తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన  సఫారీలు అద్భుతంగా పుంజుకున్నారు. 63 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా కీలక ఆటగాళ్లు వెనుదిరుగుతున్నప్పటికీ ఓపెనర్ డీన్ ఎల్గర్ మాత్రం క్రీజులో పాతుకుపోయాడు. భాతర బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ సెంచరీ సాధించాడు. మొత్తంగా 287 బంతులు ఎదుర్కొన్న ఎల్గర్ 18 ఫోర్లు, 4 సిక్సర్లతో 160 పరుగులు చేసి ఆరో వికెట్‌గా వెనుదిరిగాడు.

ఈ సెంచరీతో భారత గడ్డపై 2010 తర్వాత సెంచరీ చేసిన తొలి సౌతాఫ్రికా క్రికెటర్‌గా ఎల్గర్ అరుదైన ఘనత సాధించాడు. 2010లో భారత్‌లో ఆమ్లా సెంచరీ సాధించాడు. ఆ తర్వాత మళ్లీ ఎల్గరే. ఎల్గర్ అవుటైన కాసేపటికే వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ క్వింటన్ డికాక్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తం 163 బంతులు ఎదుర్కొన్న డీకాక్ 16 ఫోర్లు, 2 సిక్సర్లతో 111 పరుగులు చేశాడు. కెప్టెన్ ఫా డుప్లెసిస్ 55 పరుగులు చేశాడు. దీంతో మూడోరోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా 8 వికెట్ల నష్టానికి 385 పరుగులు చేసింది.