ఈఎంఐలు పెరగనున్నాయ్

ఈఎంఐలు పెరగనున్నాయ్

మోడీ అధికారంలోకి వచ్చిన తరవాత తొలిసారి.. ఆర్బీఐ వరుసగా రెండోసారి వడ్డీ రేట్లను పెంచింది. జూన్ లో పావు శాతం, ఇవాళ మరో పావు శాతం పెంచడంతో మొత్తం పెరుగుదల అర శాతానికి చేరింది. వడ్డీ రేట్లు తగ్గాయని కాస్త సంబర పడుతునక్నవారికి... ఇది నిజంగా చేదువార్తే. ఎందుకంటే ఇప్పటి వరకు వేచిచూసిన బ్యాంకులన్నీ ఇక ఇంటి రుణాలపై ఈఎంఐని పెంచడం ఖాయం. జూన్‌ నెల పెంపులో బ్యాంకులు కాస్త దూకుడు తగ్గించి స్వల్పంగా వడ్డీ రేట్లను పెంచాయి. చాలా తక్కువ వ్యవధిలో ఇలా వడ్డీ రేట్లు పెరగడంతో బ్యాంకులు కచ్చితంగా ఈ మొత్తం భారాన్ని కస్టమర్లపై వేసే అవకాశముంది. రెండు రోజుల క్రితం డిపాజిట్లపై వడ్డీ రేట్లను ఎస్బీఐ పెంచినపుడు మార్కెట్లో రుణాలపై కూడా వడ్డీ రేట్ల పెంపు ఖాయమనే సంకేతాలు వెళ్ళాయి. 2013లో అపుడు రఘురామరాజన్‌ వరుసగా రెండు సార్లు వడ్డీ రేట్లు పెంచారు. తరవాత వరుసగా రెండుసార్లు వడ్డీ రేట్లను పెంచడం ఇదే మొదటిసారి.  రివర్స్‌ రెపో రేటు కూడా పెంచినందున బ్యాంకులపై పెద్ద భారం కానప్పటికీ... ద్రవ్యోల్బణ అదుపులో భాగంగా బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అలాగే పర్సనల్‌ లోన్లపై కూడా వడ్డీ రేట్లను పెంచడం ఖాయంగా కన్పిస్తోంది.

రెపో రేటు అంటే... బ్యాంకులకు ఆర్బీఐ రుణాలు ఇస్తుంది. ఈ రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ రేటునే రెపో రేటు అంటారు.
రివర్స్‌ రెపో రేటు.. బ్యాంకుల నుంచి ఆర్బీఐ కూడా రుణాలు తీసుకుంటుంది. దీనికి ఆర్బీఐ చెల్లించే వడ్డీ రేటునే రివర్స్ రెపో రేటు అంటారు.

ఇవాళ రెపో, రివర్స్ రెపో రేటును ఆర్బీఐ పెంచింది. అయితే ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు సంతృప్తికరంగా ఉన్నందున.. రుణాలకు డిమాండ్‌ ఉంటుంది.. కాబట్టి బ్యాంకులు ఆర్బీఐ నుంచి రుణాలు తీసుకునే అవకాశాలే అధికంగా ఉన్నాయి. మరోవైపు బ్యాంకుల నుంచి ఆర్బీఐ  రుణాలు తీసుకునే ఛాన్స్ తక్కువ. ఈ నేపథ్యంలో బ్యాంకులపైనే అధిక భారం పడనుంది.