తిరుమల ఆలయంలో ఉద్యోగం చేయాలంటే బెంబేలెత్తుతున్న ఉద్యోగులు...

తిరుమల ఆలయంలో ఉద్యోగం చేయాలంటే బెంబేలెత్తుతున్న ఉద్యోగులు...

అక్కడ విధుల కోసం ఎగబడుతుంటారు. అక్కడ డ్యూటీ పడిందంటే అదో పెద్ద అదృష్టం. దానికోసం పెద్ద పెద్ద సిఫారసులే కావాలి. ప్రజాప్రతినిధుల స్థాయిలో పలుకుబడి ఉంటేకానీ డ్యూటీ పడదు. అంత డిమాండ్‌ ఉన్నచోట ఒక్కసారిగా పరిస్థితి తలకిందులైంది. అక్కడ డ్యూటీ అంటేనే భయపడిపోతున్నారు. అక్కడ వేయకండి... వద్దు బాబోయ్‌ అని ప్రాధాయే పడుతున్నారట. ఎక్కడో ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. 

శ్రీవారి ఆలయంలో 70 మందికే  పనిచేసే భాగ్యం!

ఇల వైకుంఠం తిరుమలలో కొలువైన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారిని దర్శించుకోవాలని భక్తులు ఎంతో పరితపిస్తారు. అలాగే శ్రీవారి సన్నిధిలో విధులు నిర్వహించాలని ప్రతిఒక్క టీటీడీ ఉద్యోగి కోరుకుంటారు. శ్రీవారి ఆలయంలో విధులలో ఉంటే పరిచయాలు పెరుగుతాయి. పలుకుబడి ఉంటుందన్నది టీటీడీ ఉద్యోగుల భావన. తిరుమల తిరుపతి దేవస్థానంలో 7500 మంది శాశ్వత ఉద్యోగులున్నా.. ఆలయంలో పనిచేసే భాగ్యం 70 మంది వరకే ఉంటుంది. 

కరోనాతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి!

ఈ పరిమితుల కారణంగా  అటెండర్‌  మొదలుకొని డిప్యూటీ ఈవో స్థాయి అధికారి వరకూ పలుకుబడి ఉంటేనే అక్కడ విధులు చేసే భాగ్యం కలుగుతుంది. ఇలా ఎంతో డిమాండ్ ఉండే ఆ డ్యూటీలకు.. అక్కడ విధుల్లో ఉండాలనుకునే వారికి కరోనా దెబ్బతో ఒక్కసారిగా పరిస్థితి మార్చేసింది. కరోనా వల్ల శ్రీవారి ఆలయాన్ని మార్చి 20 నుంచి జూన్‌ 7 వరకు దర్శనాలు ఆపేశారు. ఆ సమయంలోనూ ఉద్యోగులు ఆలయంలో ఎప్పటిలాగే విధులు నిర్వహించారు. 

జూన్‌ 19 నుంచి తిరుమలలో కరోనా కేసుల నమోదు!

అన్‌లాక్‌ 1.0లో ఆలయాలకు మినహాయింపులు ఇవ్వడంతో తిరుమల శ్రీవారి  దర్శనానికి పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తున్నారు. నాటి నుంచీ టీటీడీ ఉద్యోగులలో తెలియని భయం ప్రారంభమైందట. కరోనా పాజిటివ్‌ కేసులకు తిరుమల మినహాయింపు లేకుండా పోయింది. అప్పటి వరకూ ఒక్క కేసు కూడా లేకుండా గ్రీన్‌జోన్‌గా ఉన్న తిరుమలలో జూన్‌ 19 నుంచి కేసుల నమోదు మొదలైంది. 

టీటీడీ ఉద్యోగుల్లో మొదలైన ఆందోళన!

ఇదే సమయంలో శ్రీవారి ఆలయంలో విధులు నిర్వహిస్తున్న విభాగాలన్నింటిలోనూ.. పాజిటివ్‌ కేసులు వెలుగుచూడటంతో ఆందోళన మొదలైంది. ప్రధాన ఆలయంలోని అర్చకులు మొదలుకొని.. పెద్ద జియ్యంగార్లు.. ప్రసాదాలు తయారు చేసే పోటు కార్మికులు.. ప్రసాదాలు పంపిణీ చేసే ఉద్యోగులు.. మంగళవాయిద్యాలు వాయించే వారు... శ్రీవారి వాహనాలను మోసే వాహన బేరర్లు.. ఆలయంలో ఇతర విధులు నిర్వహించే సిబ్బంది.. భద్రతా విధుల్లో ఉన్న వారు.. ఇలా అన్ని విభాగాలలో కరోనా పాజిటివ్‌  కేసులు నమోదు కావడంతో ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. 

ఓ ఉద్యోగితోపాటు అర్చకులు ఒకరు కరోనాతో చనిపోయారు!

ఈ దెబ్బకు ఒకదశలో శ్రీవారి ఆలయంలో తాత్కాలికంగా దర్శనాలను నిలిపివెయ్యాలన్న డిమాండ్‌ వచ్చింది. కానీ.. దానికి ప్రభుత్వం అంగీకరించలేదని సమాచారం.  ఇదే సమయంలో ఆలయంలో విధులు నిర్వహించే ఓ ఉద్యోగి వారం రోజుల క్రితం కరోనాతో మరణించడం.. ఇటీవలే అర్చకులు ఒకరు కరోనాతో కాలం చేయడంతో మిగిలిన వారికి ప్రాణ భయం పట్టుకుంది. కేసులు రోజు రోజుకీ పెరిగిపోతుండటంతో.. చాలా మందిలో ఇతర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉండటం.. కరోనా సోకితే మరింత ఇబ్బంది ఎదురయ్యే ప్రమాదం ఉండటంతో కలవరపడుతున్నారట. 

ఆలయంలో విధులు వద్దని ప్రాధేయపడుతున్నారా? 

ఇన్నాళ్లూ శ్రీవారి ఆలయంలో విధులు అంటే.. పెద్ద పెద్ద రికమండేషన్స్‌ చేయించుకునేవారు. ఆదిక్కుకే రావడం లేదు. కుదిరితే సెలవుపై వెళ్లడం... లేదా మరో చోటుకు ట్రాన్స్‌ఫర్‌ చేయమని రివర్స్‌లో రికమండేషన్‌ చేయించుకుంటున్నారట. ఎంతో పలుకుబడి ఉంటే కానీ దక్కని పోస్టింగ్‌లకు ఇప్పుడు డిమాండ్‌ లేకుండా పోయింది. ఆ డ్యూటీ వద్దు అని పారిపోతున్నారు. మరి.. ఈ పరిస్థితి ఎప్పటికి చక్కబడుతుందో.. ధైర్యంగా విధులు నిర్వహించే పరిస్థితి ఎప్పుడు వస్తుందో ఆ దేవుడికే తెలియాలి.