ముగిసిన దిల్‌రాజు, పీవీపీ వివాదం...

ముగిసిన దిల్‌రాజు, పీవీపీ వివాదం...

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరియర్‌లో మైల్ స్టోన్ లాంటి 25వ చిత్రాన్ని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఈ మూవీని దిల్ రాజు, అశ్వినీదత్ నిర్మించాలని భావించినా... అంతకు ముందు సూపర్ స్టార్ ఇచ్చిన కమిట్‌మెంట్‌తో పీవీపీకి కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామ్యం చేయాల్సి ఉంది. అది జరగకపోవడంతో పీవీపీ కోర్టును ఆశ్రయించారు... అయితే ఇప్పుడు దిల్ రాజు, అశ్వినీ దత్... పీవీపీతో సెటిల్‌మెంట్ చేసుకోవాలని నిర్ణయించారు. అంటే మహేష్ @25 మూవీని దిల్‌రాజు, అశ్వినీదత్, పీవీపీ... ముగ్గురు సంయుక్తంగా నిర్మించనున్నారన్నమాట... దీంతో వీరిమధ్య నెలకొన్న వివాదానికి తెరపడినట్లు అయ్యింది.

ఈ వ్యవహారంలో లోతుగా వెళ్తే పీవీపీ బ్యానర్‌లో మూడు సినిమాలు చేయడానికి మహేష్... భారీ పారితోషికంతో అగ్రిమెంట్ తీసుకున్నారు. వీరి కాంబినేషన్ లో వచ్చిన బ్రహ్మోత్సవం సినిమా విజయం సాధించలేకపోవడంతో ఆ అగ్రిమెంట్ కాస్త రెండు సినిమాలకే పరిమితం అయ్యింది. ఇప్పటికే ఒకటి పూర్తవ్వడంతో రెండో సినిమాను వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయాలని నిర్ణయించుకున్నారు. ఇక వెంటనే ఈ ప్రాజెక్టు ప్రీ ప్రొడక్షన్ పనులకు దాదాపు మూడు కోట్ల మేర ఖర్చు పెట్టారు పివిపి. కానీ వీరిద్దరి మధ్య కాస్త క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడంతో వంశీ పైడిపల్లి మధ్యలోనే వెళ్లిపోయారు. అట్నుంచి దిల్ రాజు, అశ్వనీ దత్ లు నిర్మాతలు గా ఓ కొత్త ప్రాజెక్టును అనౌన్స్ చేశారు. ఇక దీనిపై పీవీపీ ఫుల్ సీల్డ్ స్క్రిప్ట్ తో చెన్నై హైకోర్ట్ లో కేసు వేశారు. దీనిపై 2016 నవంబర్ లో విచారణ జరిపి ప్రాజెక్టు ముందుకెళ్ళకుండా స్టే విధించింది. ఈ నేపథ్యంలో మహేష్ భార్య... నమ్రత, దిల్ రాజు మరియు పీవీపీలకు ఓ మీటింగ్ ఏర్పాటు చేసి ఈ ప్రాజెక్టులో పీవీపీని కూడా భాగస్వామిగా చేసుకోవాలని ప్రపోజల్చేసింది. కానీ, దిల్ రాజు మాత్రం ఈ కేసుపై స్టేను కొట్టేస్తారనే నమ్మకంతో షూటింగ్‌కు ప్లాన్ చేశారు. అదికాస్త కోర్టులో బెటిసికొట్టడంతో ఇప్పుడు మొత్తానికి రాజీకి వచ్చారు.