కెమెరాకు చిక్కిన అద్భుత ప్రాణి

కెమెరాకు చిక్కిన అద్భుత ప్రాణి

అదో అద్భుత ప్రాణి. దక్షిణ అమెరికా ఖండంలో మాత్రమే కనిపించే ఓ అరుదైన క్షీరదం. గత పదేళ్లలోనే కొన్ని చోట్ల వీటి సంఖ్య 30% కంటే దిగువకు పడిపోయింది. 21 వేర్వేరు ఉపజాతులు ఉండే ఈ జీవిపైన కవచంలా ఉండే కప్పుని సంగీత వాద్యాల తయారీకి వాడతారు. భూగోళంపై  దాదాపు కనుమరుగయ్యే స్థితికి చేరిన ఈ ప్రాణి కెమెరా కంటికి చిక్కింది. ఆ వీడియోని పర్వీన్ కశ్వాన్ అనే ఐఎఫ్ఎస్ అధికారి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ ఈ జీవి పేరేంటో చెప్పాలంటూ చిన్నపాటి క్విజ్ ప్రారంభించారు. మరీ కష్టపడే పని లేకుండా ఇది ఇటీవలే ఓ పెద్ద క్రీడా సంబరానికి మస్కట్ గా కూడా ఎంపికైందని క్లూ ఇచ్చారు. 

వెంటనే అంతా ఉత్సాహంగా జవాబులు ఇచ్చారు. ఇది ఆర్మడిల్లో అని, వీటి పైకప్పు మీద ఉండే చారలను బట్టి జాతులుగా విభజిస్తారని తమకు తెలిసిన విషయాలన్నీ పంచుకున్నారు. ఉభయ అమెరికా ఖండాలలో కనిపించే ఈ ఆర్మడిల్లోలు శత్రువు నుంచి తప్పించుకొనేందుకు తలను, కాళ్లను కవచం లోపలికి ముడిచి పెట్టుకుంటాయి. దాంతో అది గట్టి బంతిలా మారిపోతుంది. ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాలు చెప్పారు. ఆ ఐఎఫ్ఎస్ అధికారి లక్కీ లాటరీ తీసి తనకు నచ్చిన పుస్తకాన్ని బహూకరిస్తానని ప్రకటించారు.