ఇంజినీర్స్ డే: ఇన్ ది మెమరీ ఆఫ్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య

ఇంజినీర్స్ డే: ఇన్ ది మెమరీ ఆఫ్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య

భారత రత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య (1861 -1962) జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం సెప్టంబర్ 15వ తేదీన జాతీయ ఇంజినీర్స్ డేగా జరుపుకుంటున్నాం. మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్రముఖ ఇంజినీర్‌‍గాను, పాలనాదక్షునిగా ఎంతో కీర్తిని సొంతం చేసుకున్నారు. ఇంజినీరింగ్ విభాగంలో 30 సంవత్సరాల పాటు అపారమైన సేవలనందించిన విశ్వేశ్వరయ్య దేశ ప్రగతికి ఎంతగానో దోహదపడ్డారు. 1884లో పూణే సైన్స్ విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ విద్యను పూర్తి చేసుకున్న విశ్వేశ్వరయ్య నేరుగా గవర్నమెంట్ ఆఫ్ బోంబే (ఇప్పటి ముంబై) ప్రజా పనుల శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా నియామకమయ్యారు.

ఆ తరువాత భారత నీటిపారుదల కమీషన్ విజ్ఞప్తి మేరకు విశ్వేశ్వరయ్య దక్కను ప్రాంతంలో నీటిపారుదల వ్యవస్థను రూపొందిచారు. ఈయన రూపొందించిన ఆటోమాటిక్ వరద గేట్ల వ్యవస్థను 1903లో మొదటిసారిగా పూణే దగ్గర ఖడక్ వాస్లా వద్ద నెలకొల్పారు. వరద సమయంలో ఆనకట్ట భద్రతను దృష్టిలో ఉంచుకుంటూనే అత్యధిక నీటి నిల్వ విధానానికి ఈ వ్యవస్థ ఎంతగానో దోహదపడింది. 1908లో మూసి నదికి వరద రావడంతో హైదరాబాద్ నగరం ప్రమాదంలో చిక్కుకుంది. దీంతో హైదరాబాద్ నగరాన్ని వరద ముప్పు నుంచి రక్షించేందుకు అప్పటి నిజాం నవాబు విశ్వేశ్వర్యను ఆహ్వానించి సమస్యకు పరిష్కారం వెతకాలని కోరటంతో పటిష్టమైన నగర మురుగునీటి పారుదల పథకాన్ని విశ్వేశ్వర్య రూపొందించారు.

ఆ తరువాత మూసీ, ఈసీ నదుల పై రిజర్వాయర్లను నిర్మించటంతో హైదరాబాద్ నగరానికి వరద ప్రమాదం తప్పింది. విశాఖపట్నం రేవును సముద్రపు కోత నుండి రక్షించే వ్యవస్థను రూపొందించడంలోనూ విశ్వేశ్వరయ్య పాత్ర ఉంది.  విశాఖ రేవు నిర్మాణ సమయంలో అలల పోటు ఎక్కువగా ఉండేది. అలల తీవ్రతను తగ్గించడం కోసం ఆయన ఆయన ఓ సలహా ఇచ్చారు. రెండు పాత నౌకల్లో బండరాళ్లు వేసి సాగర తీరానికి చేరువగా ముంచేయాలని సూచించారు. అలా చేయడం వల్ల అలల తీవ్రత తగ్గింది. కొన్నాళ్ల తర్వాత కాంక్రీటుతో బ్రేక్ వాటర్స్ నిర్మించారు. ఇక తిరుమల నుంచి తిరుపతి ఘాట్‌ రోడ్డు నిర్మాణానికి ప్లాన్‌ రూపకల్పనలో విశ్వేశ్వరయ్య కీలక పాత్ర పోషించారు.