వరల్డ్‌కప్‌ సెమీస్‌లోకి ఇంగ్లండ్‌

వరల్డ్‌కప్‌ సెమీస్‌లోకి ఇంగ్లండ్‌

వరల్డ్‌కప్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌.. ఈసారి అంచనాల మేర రాణించింది. న్యూజిలాండ్‌తో జరిగిన 'తప్పక గెలవాల్సిన' మ్యాచ్‌లో సూపర్‌ విక్టరీ సాధించింది. 119 పరుగుల తేడాతో కివీస్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌తో తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 305 పరుగులు చేసింది. అద్భుత ఫామ్‌లో ఉన్న ఓపెనర్‌ బెయిర్‌స్టో(106; 99బంతుల్లో 15x4, 1x6) మరోసారి సెంచరీతో చెలరేగాడు. మరో ఓపెనర్‌ జేసన్‌ రాయ్ ‌(60; 61బంతుల్లో 8x4) బెయిర్‌స్టోకు మంచి సపోర్ట్‌ ఇచ్చాడు. న్యూజిలాండ్‌ బౌలర్లలో బౌల్ట్‌, నీషమ్‌, హెన్నీలు తలో రెండేసి వికెట్లు తీశారు.  
306 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ ప్రారంభించిన న్యూజిలాండ్‌.. 186 పరుగులకే చతికిలబడింది. 65 బంతుల్లో 57 పరుగులు చేసిన లాథమ్‌ మినహా మరెవరూ రాణించలేదు. జట్టును గట్టెక్కిస్తారనుకున్న టేలర్ 28, కేన్ విలియమ్సన్ 27 పరుగులే చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్‌వుడ్ 3 వికెట్లు తీశాడు.