నేడు ఇంగ్లాండ్‌తో మూడో వన్డే

నేడు ఇంగ్లాండ్‌తో మూడో వన్డే

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. 86 పరుగుల తేడాతో టీమిండియా ఓడిపోవడంతో  సిరీస్‌ను ఇంగ్లండ్‌ 1-1తో సమం చేసింది. మూడు వన్డేల సిరీస్‌లో మొదటి వన్డేను భారత్ గెలవగా.. రెండవ వన్డే ఇంగ్లాండ్ కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో నిర్ణయాత్మక మూడో వన్డే పోరుకు ఇరు జట్లు సిద్ధమయ్యాయి. మంగళవారం లీడ్స్‌ మైదానం వేదికగా సాయంత్రం 5 గంటలకు మ్యాచ్ ప్రారంభమవనుంది.

మిడిలార్డర్‌ వైఫల్యం:

ఇంగ్లండ్‌ పర్యటనలో ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్‌లలో భారత్‌ మూడు గెలిచింది. టీ-20 తరహాలోనే వన్డే సిరీస్ ఫలితం కూడా చివరి మ్యాచ్ వరకు వేచిచూడాల్సి వచ్చింది. అయితే భారత్‌ గెలిచిన మూడు మ్యాచ్ లలో టాపార్డర్‌ రాణించింది. ఓపెనర్ రోహిత్‌ రెండు, రాహుల్‌ ఒక సెంచరీతో టాపార్డర్‌లో రాణించారు. ఇక మరో ఓపెనర్  ధావన్, కెప్టెన్ కోహ్లి పర్వాలేదనిపిస్తున్నారు. మిడిలార్డర్‌ వైఫల్యమే గత వన్డేను కోల్పోయేలా చేసింది. గత మ్యాచ్ లో రైనా, ధోని రాణించినా జట్టును మాత్రం ఆదుకోలేకపోయారు. గత మ్యాచ్ లో నెమ్మదిగా ఆడిన ధోనీపై విమర్శల వర్షం కురిసింది. అయితే ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఆడగల సమర్ధుడు ధోని. ఆల్ రౌండర్  పాండ్యా కూడా అంచనాలకు మించి ఆడటం లేదు. సిరీస్ డిసైడర్ మ్యాచ్ కాబట్టి ధోని, రైనా, పాండ్యా రాణించాల్సిన అవసరం ఉంది. బెంచ్ కే పరిమితమవుతున్న దినేశ్‌ కార్తీక్‌ను ఆడించే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇదే జరిగితే రైనాను పక్కనపెట్టాల్సి వస్తుంది. రెండో వన్డేలో స్పిన్నర్లు బాగా బౌలింగ్‌ చేసినా.. పేస్‌ బౌలింగ్‌ గాడి తప్పింది. ఇన్నింగ్స్ చివరి ఎనిమిది ఓవర్లలో పేస్ దళం 62 పరుగులిచ్చారు. దీంతో భువనేశ్వర్‌, బుమ్రా లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఐతే ఫిట్‌నెస్‌లో నిరూపించుకుంటే భువి ఈ మ్యాచ్‌లో ఆడే అవకాశం ఉంది. భువి జట్టులోకి వస్తే పేస్ బౌలింగ్ బలంగా మారుతుంది.

ఆ ఒక్కటే సమస్య:

మరోవైపు రెండో మ్యాచ్ లో విజయం సాధించిన ఇంగ్లాండ్‌ ఆత్మవిశ్వాససంతో బరిలోకి దిగుతుంది. గత మ్యాచ్ లో రూట్‌ అద్భుత శతకంతో జట్టును ఆదుకున్నాడు. రూట్ ఫామ్‌లోకి రావడం సానుకూలాంశమే. ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ గాయపడటంతో అతని స్థానంలో జేమ్స్‌ విన్స్‌ లేదా సామ్ బిల్లింగ్స్‌ తుది జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇద్దరూ కూడా ఓపెనింగ్ లో బాగా అడగల సత్తా ఉన్నవారే. ఇక మిడిల్ ఆర్డర్ లో కెప్టెన్ మోర్గాన్, అలీ, బట్లర్ ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆల్‌రౌండ్‌ బెన్‌ స్టోక్స్‌ అంతగా ఫామ్‌లో లేకపోవడం ఒక్కటే ఇంగ్లాండ్‌కు పెద్ద సమస్య. బౌలింగ్ లో కూడా విల్లే, వుడ్, ప్లంకెట్ లు దూసుకుపోతున్నారు. మొత్తంగా ఇంగ్లాండ్ జట్టు సమతూకంగా బరిలోకి దిగుతుంది. ఈ నేపథ్యంలో మూడో వన్డే రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.