వరల్డ్‌కప్‌: ఫస్ట్‌ మ్యాచ్‌లో గెలుపెవరిదంటే..

వరల్డ్‌కప్‌: ఫస్ట్‌ మ్యాచ్‌లో గెలుపెవరిదంటే..

ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఘన విజయం సాధించింది. దక్షిణాఫ్రికాపై 104 పరుగుల తేడాతో గెలుపొందింది. 312 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికా 39.5 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది.
తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. 89 పరుగులతో స్టోక్స్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు తొలి ఓవ‌ర్‌లోనే షాక్‌ త‌గిలింది. రెండో బంతికే ఓపెన‌ర్ బెయిర్‌స్టోను తాహిర్‌ అవుట్‌ చేశాడు. ఆ తర్వాత  జేసన్‌ రాయ్‌, జోరూట్‌లు రెండో వికెట్‌కు 106 పరుగులు జోడించి జట్టును గాడిలో పెట్టారు.  ఈక్రమంలో 19వ ఓవర్లో రాయ్‌, 20వ ఓవరలో రూట్‌ పెవిలియన్‌ చేరారు. 60 బంతుల్లో 3 సిక్సర్లు, 4 ఫోర్లతో 57 పరుగులు చేసిన మోర్గాన్‌ తాహిర్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. బట్లర్‌, అలీ వెనువెంటనే అవుటైనా.. స్టోక్స్‌ ఒంటరి పోరాటం చేశాడు. చివర్లో పరుగుల వేగాన్ని పెంచే క్రమంలో 89 పరుగలకు అవుటయ్యాడు. 

312 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. జోఫ్రా ఆర్చర్‌ 145 కిలోమీటర్ల వేగంతో విసిరిన బంతి హెల్మెట్‌ గ్రిల్స్‌కు తగలడంతో ఓపెనర్‌ హషీమ్‌ ఆమ్లా 5 పరుగుల వద్ద రిటైర్డ్‌ హర్ట్‌గా మైదానం వీడాడు.  ఆ తర్వాత 36 పరుగుల వద్ద మార్కరమ్ (11) వికెట్‌ను దక్షిణాఫ్రికా కోల్పోయింది. వెనువెంటనే డుప్లెసిస్‌ కూడా అవుటవడంతో  క్వింటన్ డికాక్, డసెన్‌లు నిలకడగా ఆడారు.  74 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 68 పరుగులు చేసి జోరు మీద కనిపించిన డికాక్‌.. 129 పరుగుల వద్ద అవుటయ్యాడు. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన డుమినీ (8), ప్రెటోరియస్ (1)‌లు కూడా స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. 

ఈ దశలో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న డసెన్‌ (50)ను జోఫ్రా ఆర్చర్‌ పెవిలియన్‌కు పంపాడు. 25 బంతుల్లో 4 ఫోర్లతో 24 పరుగులు చేసిన ఫెలుక్‌వాయో.. రషీద్‌ బౌలింగ్‌లో స్టోక్స్‌కు క్యాచ్‌కు ఇచ్చి అవుటయ్యాడు. రిటైర్డ్‌ హార్ట్‌గా వెనుదిరిగి మళ్లీ క్రీజ్‌లోకి వచ్చిన ఆమ్లా 13 పరుగలకు ప్లంకెట్‌ బౌలింగ్‌లో కీపర్‌ బట్లర్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. చివర్లో రబాడ, తాహిర్‌లను వరుస బంతుల్లో స్టోక్స్‌ అవుట్‌ చేయడంతో ఇంగ్లండ్‌ను విజయం వరించింది.