ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ విజయం

ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ విజయం

కార్డిఫ్ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్‌ ఘన విజయం సాధించింది. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 38 పరుగుల తేడాతో ఆసీస్‌పై గెలిచి ఐదు వన్డేల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 343 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌ 47.1 ఓవర్లలో 304 పరుగులకు  ఆలౌటయింది. ఆసీస్‌ ఓపెనర్లు ట్రావిస్ హెడ్(19), షార్ట్(21) శుభారంభం ఇవ్వలేదు. జట్టు స్కోర్ 24 వద్ద హెడ్ పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజ్ లోకి వచ్చిన మార్ష్ ఇన్నింగ్స్ ను ముందుకు నడిపాడు. ఈ దశలో షార్ట్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత స్టోనిస్(9), ఫించ్(0)లు కూడా త్వరగానే అవుట్ అవ్వడంతో ఆసీస్ జట్టు కష్టాల్లో  పడింది. ఈ సమయంలో మాక్స్ వెల్, మార్ష్ ల జోడి ఆసీస్ ఇన్నింగ్స్  ను గాడిలో పెట్టారు. ధాటిగా ఆడే ప్రయత్నంలో మ్యాక్సీ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత ఆస్టన్‌ అగర్‌(46; 42 బంతుల్లో 7 ఫోర్లు)లతో రాణించాడు. అర్ధసెంచరీకి చేరువలో అగర్‌ అవుట్ అవడంతో.. షాన్‌ మార్ష్‌కి సహకరించే వారు కరువయ్యారు. మార్ష్(131;116  బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేసినా.. జట్టును గెలిపించలేకపోయాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో ప్లంకెట్‌ నాలుగు వికెట్లు తీసాడు.

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 342 పరుగులు చేసింది. ఓపెనర్‌ జాసన్‌ రాయ్‌, బెయిర్‌ స్టోలు మొదటి నుంచే ధాటిగా ఆడి స్కోర్ బోర్డును పరుగెత్తించారు. ముఖ్యంగా బెయిర్‌ స్టో(42; 24 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సర్‌) చెలరేగి ఆడాడు. బెయిర్‌ స్టో నిష్క్రమణ అనంతరం హేల్స్(26), రూట్(22)లు కూడా రాయ్‌కి చక్కటి సహకారం అందించారు. వీరి నిష్క్రమణ తర్వాత రాయ్(120; 108 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ చేయగా.. బట్లర్‌( 91  నాటౌట్‌; 70 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు) బ్యాట్‌ ఝుళిపించడంతో ఇంగ్లండ్‌ భారీ స్కోరు నమోదు చేసింది. 'ప్లేయర్ అఫ్ ది మ్యాచ్' జాసన్‌ రాయ్‌కి దక్కింది.