భారత్ పరాజయం

భారత్ పరాజయం

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శనివారం లార్డ్స్ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత్ ఘోర పరాభవాన్ని చవిచూసింది. 86 పరుగుల తేడాతో టీమిండియా ఓడిపోవడంతో  సిరీస్‌ ఇంగ్లండ్‌ 1-1తో సమం చేసింది. 323 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు సరైన భాగస్వామ్యం నెలకొల్పలేదు. ఓపెనర్ రోహిత్‌ శర్మ(15) త్వరగానే ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కేఎల్‌ రాహుల్‌(0) డక్ అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌(36) ధాటిగా ఆడినా ఎక్కువసేపు క్రీజులో నిలువలేదు. ఈ దశలో కష్టాల్లో పడిన భారత్ ను కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి(45), సురేశ్‌ రైనా(46) ఆదుకునే ప్రయత్నం చేశారు. ఇద్దరు నాలుగో వికెట్‌కు 80 పరుగులు నమోదు చేసిన తర్వాత కోహ్లి, రైనా నిష్క్రమించడంతో భారత్‌ మరింత కష్టాల్లో పడింది. రన్‌రేట్‌ పెరిగిపోవడంతో ధోని, పాండ్యాలు పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డారు. పాండ్యా (21), ఉమేశ్‌ యాదవ్‌(0) లు కూడా పెవిలియన్ చేరారు. మహేంద్ర సింగ్‌ ధోని కూడా 37(59 బంతుల్లో 2ఫోర్లు) వెనుదిరగడంతో భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 236 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లండ్‌ బౌలర్లలో ప్లంకెట్‌ నాలుగు వికెట్లు తీసాడు.

అంతకుముందు టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది. ఓపెనర్లు రాయ్(40), బరిస్టో(38)  లు మంచి ఆరంభమే ఇచ్చారు. అనంతరం జోయ్‌ రూట్‌(113; 116 బంతుల్లో 8ఫోర్లు, 1 సిక్సర్‌) సెంచరీతో కదంతొక్కాడు. కెప్టెన్‌ మోర్గాన్‌ (53; 51 బంతుల్లో 4ఫోర్లు, 1 సిక్సర్‌)తో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో డేవిడ్‌ విల్లే(50; 31 బంతుల్లో 5ఫోర్లు, 1 సిక్సర్‌) మెరుపులతో ఇంగ్లండ్‌ 322 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత్‌ బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌ మూడు వికెట్లు తీసాడు. 'ప్లేయర్ అఫ్ ది మ్యాచ్' రూట్ కి లభించింది.