చేసింది చాలు, ఇంటికొచ్చెయ్ బిడ్డా: తేజ్ ప్రతాప్ కి రబ్రీ పిలుపు

చేసింది చాలు, ఇంటికొచ్చెయ్ బిడ్డా: తేజ్ ప్రతాప్ కి రబ్రీ పిలుపు

బీహార్ రాజకీయాల్లో బలమైన స్తంభంగా గుర్తింపు పొందిన ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ దాణా కుంభకోణంలో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. మరోవైపు ఆయన కుటుంబంలో ఇద్దరు కొడుకులు తేజ్ ప్రతాప్, తేజస్వీ యాదవ్ ల మధ్య ఘర్షణ కొనసాగుతోంది. తేజ్ ప్రతాప్ యాదవ్, భార్య ఐశ్వర్యా రాయ్ కి పొసుగుతున్నట్టు లేదు. తేజ్ ప్రతాప్ తన భార్యకు విడాకులు ఇస్తానని ఆ మధ్య ప్రకటించారు.

తేజ్ ప్రతాప్ యాదవ్ విడాకులకు అర్జీ పెట్టిన తర్వాత ఇంటికి తిరిగి రాలేదు. ఈ వ్యవహారాలు చూసి తల్లి రబ్రీ దేవీ విచార సముద్రంలో మునిగిపోయారు. తేజ్ ప్రతాప్ ఇక ఇంటికి రావాలని బలంగా కోరుకుంటున్నారు. మీడియా వర్గాల కథనం ప్రకారం రబ్రీ దేవి తన కుమారుడు తేజ్ ప్రతాప్ కు ఇంటికి తిరిగి రావాలని భావోద్వేగ పూరితమైన పిలుపు నిచ్చారు.

మీడియాతో మాట్లాడుతూ రబ్రీదేవి 'ఇది ప్రతి ఇంట్లో జరిగే వ్యవహారాలే. కొంత కాలం తర్వాత అంతా వేర్వేరుగా ఉండటం ప్రారంభిస్తారు. మా కుటుంబం సామానేం కాదు పంచుకోవడానికి. ఎన్ని కుట్రలు చేసినా మా కుటుంబం విడిపోదు. మా కుటుంబానికి పరువు ప్రతిష్ఠలు ఉన్నాయి' అన్నారు.

తేజ్ ప్రతాప్ యాదవ్, తేజస్వీ యాదవ్ మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవని రబ్రీదేవి స్పష్టం చేశారు. 'కొందరు నా కొడుకుని రెచ్చగొడుతున్నారు. ఇందులో బీజేపీ, జేడీయుకి సంబంధించిన కొందరు వ్యక్తుల హస్తం ఉందని' రబ్రీ ఆరోపించారు.

లాలూ యాదవ్ అవినీతి కేసులో జైల్లో ఉన్నారు. ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్ పార్టీ వ్యవహారాలు చూస్తున్నారు. తేజస్వీయే లాలూ రాజకీయ వారసుడిగా అంతా భావిస్తున్నారు. తేజ్ ప్రతాప్ యాదవ్ తన తమ్ముడిపై బహిరంగంగా ఎలాంటి విమర్శలు చేయలేదు. కానీ తమ్ముడిపై ఆగ్రహంతో ఇటీవలే తాను వేరే మోర్చా ఏర్పాటు చేస్తానని బెదిరించడంతో అన్నాదమ్ముల మధ్య విభేదాలు ఉన్నట్టు స్పష్టంగా బయటపడింది.