ఎవరి జోక్యం అవసరం లేదు...!

ఎవరి జోక్యం అవసరం లేదు...!

ఆర్టికల్ 370 రద్దు విషయంలో భారత్ తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశారు ఐక్యరాజ్యసమితిలోని భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్‌ అక్బరుద్దీన్‌.. జమ్మూ అండ్ కశ్మీర్‌పై తీసుకున్న నిర్ణయం పూర్తిగా అంతర్గత అంశమని తెలిపారు. ఈ విషయంలో ఎటువంటి బయటి జోక్యం అవసరం లేదని.. ఉగ్రవాదానికి స్వస్తి పలికితేనే పాకిస్థాన్‌తో చర్చలుంటాయని తేల్చిచెప్పారు. జమ్మూ కశ్మీర్ ప్రజలకు మంచి పాలన ఇచ్చేందుకే ఆర్టికల్ 370 రద్దుచేశామన్న ఆయన.. ఇప్పటికే జమ్మూ కశ్మీర్, లడ్డాక్‌లో పరిస్థితులను చీఫ్ సెక్రటరీ ప్రకటించారు. దీనిపై సెక్యూరిటీ కౌన్సిల్ కూడా సంతృప్తి వ్యక్తం చేసింది. కొద్దిరోజులుగా భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను భద్రతా మండలి ప్రశంసించిందన్నారు. 

జమ్మూ కశ్మీర్‌లో క్రమంగా ఆంక్షలు ఎత్తివేస్తామని.. ఇప్పటికే దీనిపై టైంటేబుల్ ప్రకటించిన విషయం తెలిసిందేనని గుర్తుచేశారు సయ్యద్‌ అక్బరుద్దీన్‌. జిహాద్ పేరుతో ఇండియాలో విధ్వంసం సృష్టిస్తామనే ప్రకటనలు ఇటీవలే విన్నామని.. విధ్వాంసాలతో సాధించేది ఏమీ ఉండదన్నారు. ఉగ్రవాదానికి ఊతమివ్వడం మానుకోవాలని.. పాకిస్థాన్, ఇతర దేశాలతో.. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలు శాంతియుతంగా సాగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. నేతల రెచ్చగొట్టే మాటలతో ప్రజలు జీహాద్ వైపు వెళ్లొద్దని విజ్ఞప్తి చేశారు. కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొల్పడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఒక ప్రాంతీయ అంశాన్ని పాక్‌, చైనా అంతర్జాతీయ సమస్యగా చూపే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. మరోవైపు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి కశ్మీర్‌పై అసాధారణ రీతిలో శుక్రవారం రహస్య సంప్రదింపులు జరిపింది. పాక్‌, చైనా ఇచ్చిన లేఖ ఆధారంగా ఈ భేటీ జరిగింది. భారత్‌, పాక్‌ ప్రతినిధులకు ఇందులో అవకాశం కల్పించలేదు.