హైదరాబాద్ చేరిన విదేశీ బృందం.. వ్యాక్సిన్ కేంద్రం పరిశీలన కోసమే

హైదరాబాద్ చేరిన విదేశీ బృందం.. వ్యాక్సిన్ కేంద్రం పరిశీలన కోసమే

కోవిడ్ వ్యాక్సిన్‌ కోసం అంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.. విదేశీ వ్యాక్సిన్ల సంగతి ఎలా ఉన్నా.. దేశీయంగా తయారవుతోన్న వ్యాక్సిన్లపైనే అందరి ఫోకస్... ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా వెళ్లి.. ప్రయోగాలు, ట్రయల్స్ ఏ దశలో ఉన్నాయి, ఎలా పనిచేస్తున్నాయి అనే దానిపై ఆరా తీశారు.. భారత్‌లో సీరం వ్యాక్సిన్‌తో పాటు.. భారత్ బయోటెక్‌ తయారు చేస్తోన్న కోవ్యాగ్జిన్‌పై అందరి దృష్టి ఉంది.. భారత్ బయోటెక్‌ను సందర్శించడానికి గాను విదేశీ రాయబారులు, హైకమిషనర్ల  బృందం హైదరాబాద్ చేరుకుంది. దేశంలో కోవిడ్ పై జరుగుతున్న పరిశోధనలను విదేశీయులకు పరిచయం చేసే లక్ష్యంతో విదేశాంగ మంత్రిత్వశాఖ ఈ ఉన్నత స్థాయి సందర్శనను ఏర్పాటు చేసింది.. కొద్ది సేపటి క్రితమే 80 దేశాలకు చెందిన రాయబారులు, హైకమిషనర్లతో కూడిన బృందం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్‌ ఎయిర్‌ పోర్ట్ నుంచి నేరుగా భారత్ బయోటెక్‌కి వెళ్లి అక్కడ కోవ్యాగ్జిన్‌కి సంబంధించి జరుగుతున్న ప్రయోగాలు, వాటి ఫలితాలను తెలుసుకోనున్నారు. ఇక తిరిగి సాయంత్రం 5:50లకు తిరుగు ప్రయాణం కానున్నారు వీరంతా.