మెట్రో ప్రయాణికులకు చుక్కలు..!

మెట్రో ప్రయాణికులకు చుక్కలు..!

మెట్రోలో వెళ్లే ప్రయాణికులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఎల్బీనగర్-అమీర్‌పేట్ రూట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత.. ఎల్బీనగర్-మియాపూర్ రూట్‌లో ప్రయాణించేవారి సంఖ్య పెరిగింది. ట్రాఫిక్ కష్టాల నుంచి విముక్తి లభించి మెట్రోను ఆశ్రయిస్తున్నారు. మరోవైపు వర్షం పడితే చాలు ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతుండడంతో మెట్రోను ఆశ్రయిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా... పలు మెట్రో స్టేషన్లలో లిఫ్టులు, ఎస్కలేటర్లు మొరాయించాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఎల్బీనగర్‌ -మియాపూర్‌ మార్గంలోని దాదాపు అన్ని మెట్రో స్టేషన్లలో ఇవాళ ఉదయం నుంచి ఇదే పరిస్థితి ఎదురైంది. విద్యుత్‌ సరఫరాలో అంతరాయంతో పాటు, జనరేటర్లు కూడా సరిగా పనిచేయకపోవడమే కారణం అంటున్నారు. అయితే, మెట్రో స్టేషన్‌కు చేరాలంటే ఎస్కలేటర్లు లేదా లిఫ్టులు తప్పనిసరి.. లేకపోతే మెట్లు ఎక్కాల్సిందే... అసలే ఉదయం ఆఫీసులకు వెళ్లే సమయంలో ఇవి మొరాయించడంతో ఉద్యోగులు, వృద్ధులు, వికలాంగులు ఇలా అంతా మెట్ల ద్వారా మెట్రో స్టేషన్‌కు చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు ఉదయం సమయంలో ప్రయాణికుల రద్దీ కూడా ఎక్కువ ఉండడంతో అవస్థలు పడుతూ మెట్ల మార్గం ద్వారా ఫ్లాట్‌ఫాం వద్దకు చేరుకుని చుక్కలు చూశారు ప్రయాణికులు.