భీకర వడగాలులకి అల్లాడుతున్న యూరప్!

భీకర వడగాలులకి అల్లాడుతున్న యూరప్!

భయంకర వడగాలులకి యూరప్ ఖండం అల్లాడిపోతోంది. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలు మండిపోతున్నాయి. వాతావరణ కాలుష్యం తారస్థాయికి చేరుతోంది. కొన్నాళ్లుగా యూరప్ ఖండాన్ని వణికిస్తున్న భీకర వడగాడ్పు శనివారం కూడా కొనసాగుతోంది. ఎరుపు హెచ్చరికని తొలగించిన మెటియో-ఫ్రాన్స్ వాతావరణ సంస్థ, ఇవాళ దేశంలోని మధ్యభాగంలో చాలా వరకు 'చాలా వేడిగా ఉంటుందని' అంచనా వేసింది. కొన్నిచోట్ల ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల సెల్సియస్ వరకు చేరుకుంటాయని తెలిపింది. 

ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ, మధ్య యూరప్ లోని కొన్ని ప్రాంతాలు ఆల్ టైమ్ అత్యధిక ఉష్ణోగ్రతలు చూస్తున్నాయి. అధికారులు ప్రజలకు ముందుజాగ్రత్తలు సూచిస్తున్నారు. శుక్రవారం ఫ్రాన్స్ లోని గార్డ్ దక్షిణ భాగంలో ఉన్న మాపెల్లియర్ సమీపాన Gallargues-le-Montueux గ్రామంలో 45.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్టు మెటియో-ఫ్రాన్స్ ప్రకటించింది. ఆగస్ట్ 2003లో ఇక్కడే 44.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డయింది. విపరీతమైన ఎండల కారణంగా భారీగా మంటలు చెలరేగుతున్నాయి. స్పెయిన్ లోని బలంగా వీస్తున్న గాలుల కారణంగా శనివారం దావానలం భగ్గుమంది. అగ్నిమాపక సిబ్బంది 72 గంటలపాటు ఎంతో శ్రమించి మంటలను అదుపు చేశారు. ఎండ కారణంగా పలు ఐరోపా దేశాల్లో మరణాలు సంభవిస్తున్నాయి.